Thursday, 24 August 2017 | Login

ఆత్మీయతకు ఆలంబనకు రక్షా బంధన్

వాస్తవం ప్రతినిధి: అమ్మలో సగం.. నాన్నలో సగం.. ఈ రెండూ కలిస్తేనే అన్న.. అవును ఓ ఆడపిల్లకు అన్న కానీ, తమ్ముడు కానీ ఉంటే కలిగే ఆనందమే వేరు. చిన్నప్పుడు సరదాగా ఆటపట్టించినా, తగాదాలు పడినా, వాదించుకున్నా పెద్దయ్యాక మాత్రం వారిలోని అనుబంధం మరింతగా పెనవేసుకుంటుంది.

అమ్మానాన్న ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాక ఈ లోకంలో ఆ అతివకు భర్తతోబాటు తోడుగా ఉండేది ఓ అన్నయ్యో.. తమ్ముడో..? అవును తనకు కష్టం వచ్చినా ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా ఓ మహిళ వెంటనే తన సోదరుడికి సమాచారం చేరవేసి ఆనందమైతే దాన్ని రెట్టింపుచేసుకుంటుంది.. బాధ అయితే దాన్ని సగానికి తగ్గించుకుంటుంది. ఈ దేశంలో అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల బంధం అన్ని బంధాలకన్నా బలమైనది. అందుకే తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ ఆ బంధం మరింత బలోపేతమవుతోంది. ఆడపిల్ల ఏ దేశంలో ఉన్నా తన మనసు మాత్రం పుట్టింటితోనే ఉంటుంది. అంటే తన తల్లిదండ్రులు, తమ్ముళ్లు అన్నల చుట్టూనే తిరుగుతుంది. తాను ఎంతదూరంలో ఉన్నా అన్నాతమ్ముళ్లు హాయింగా ఉండాలనో కోరుకుంటుంది. తన కష్టసుఖాలను తనతోనే పంచుకోవాలని ఆశపడుతుంది. అవకాశం వస్తే చాలు సోదరుడి ఇంటిముందు వాలిపోయి ఆలంబన పొందాలని ఆశిస్తుంది. ఆనాడు పురుషోత్తముడితో పోరుకుసిద్ధమైన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తన సేనలను సిద్ధం చేస్తున్నాడు. అయితే పలు దేశాలను జయించుకు వచ్చిన తన భర్త అలెగ్జాండర్ కు అరివీర పరాక్రముడు శతృభయంకరుడు అయిన పురుషోత్తముడి చేతిలో ఓటమి తప్పదేమోనని ఆయన భార్య రొక్సానా భయపడింది. అయితే తన భర్తను కాపాడుకునే నిమిత్తం రొక్సానా యుద్ధానికి ముందురోజే పూలతో ఓ రాఖీని తయారు చేసి తన చెలికత్తె ద్వారా పురుషోత్తమునికి పంపి తన భర్తను ఏమీ చేయవద్దని కోరిందట. దీంతో ఆమెను సోదరిగా భావించిన పురుషోత్తముడు ఒకానొక దశలో అలెగ్జాండర్ ను చంపే అవకాశం వచ్చినా రొక్సానాకు ఇచ్చిన మాట ప్రకారం వదిలిపెట్టేశాడట. అంటే వేలాది సంవత్సరాలుగా అన్నా చెల్లెల్ల బంధం అలాగే కొనసాగుతూ మరింత ఆత్మీయతలకు ముందడుగు వేస్తోంది. తనకు తోడుగా ఓ అన్న, తమ్ముడు ఉన్నాడంటే లోకం మొత్తం ఓ వైపు ఉన్నా తనకు ఏమీ కాదని ఆ ఆడపడుచూ భావిస్తుంది. అన్న ఉంటే అన్నీ ఉన్నట్లేనని భరోసాతో జీవిస్తుంది. దేశంలోని సోదరీసోదరులకు వాస్తవం.నెట్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. అందరి మధ్యా ఈ సోదర బంధం వెల్లివిరియాలని ఆశిస్తోంది.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock