Thursday, 24 August 2017 | Login

కాపులను ముంచేశార్రా దేవుడోయ్

 కాపు కార్పొరేషన్లో అవినీతి రాజ్యం

 నిధులన్నీ చైర్మన్, బంధువులకే భోజ్యం

వాస్తవం ప్రతినిధి:  అసలు అవినీతన్నది లేకుండా ఏ పథకమూ అమలు చేసేందుకు రూల్స్ ఒప్పుకోవన్నట్లుగా ఉంది టీడీపీ పాలన. అది కాసింత అతిశయోక్తే అయినప్పటికీ వాస్తవాలు అలాగే ఉన్నాయి. ఏదైనా పథకంలో పదిపైసలవంతో పావలావంతో అవినీతో ఇంకేదో జరుగుతుంది. కానీ చంద్రబాబు ప్రవేశపెట్టిన ఏ పథకంలోనూ పది శాతానికి మించి నిజాయితీ లేదని మిగతా 90 శాతమూ అవినీతేనని, కార్యకర్తలు, నాయకుల చేతుల్లోకే వెళుతోందన్నది పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

చివరాఖరుకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల మంజూరులోనూ ఇదే తీరు. టీడీపీ నాయకులకు కొంత ముట్టజెబితే భర్తలతో కాపురం చేసుకుంటున్నవారికీ వితంతు పింఛన్ వచ్చేస్తోంది. 40 ఏళ్లు దాటకపోయినా వృద్ధాప్య పెన్షన్ వచ్చేస్తోంది. ఇక తాజాగా కాపు కార్పోరేషన్ రుణాలు, శిక్షణా కార్యక్రమాల అమలులోనూ ఇదే తీరు. అసలు ఆ కార్పొరేషన్ ఏర్పాటే ఓ అనుమానపు విత్తనం. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని, వారికి అన్ని సౌకర్యాలు, అవకాశాలుకల్పిస్తామని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా కాపుల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు యథావిధిగా తన నైజం చూపించారు. అవసరం తీరిపోయాక కాపులను వేధించడం దగ్గర్నుంచి ఆ నాయకులను వెంటాడడం మొదలెట్టారు. ఏదైతేనేం ముద్రగడ పద్మనాభం పలుమార్లు ఉద్యమించడంతో వెనువెంటనే కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రామానుజయను చైర్మన్ గా నియమించారు. దీనికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించినా అది కుదరకపోవడంతో తూతూమంత్రంగా రూ.200 కోట్లు విదిలించారు. ఇక ఆ నిధులతో కాపు యువతకు రుణాలు, స్కిల్ డెవలప్ మెంటు సెంటర్లు, స్వయం ఉపాధికోసం సాయం, స్కాలర్షిప్పులు అంటూ భారీగా ప్రచారం చేశారు. దీనికి లక్షల్లో దరఖాస్తులు వచ్చిపడ్డాయి. అయితే ఈ పథకం కింద ఎవరెవరికి లబ్ధి చేకూరిందన్నదానికి ఆధారాల్లేవు. ఎవరికి దీన్ని అందజేశారో తెలియడం లేదు. ఇటీవల ఈ పథకం కింద స్కాలర్ షిప్పులు పొందారని అధికారులు చెబుతున్న జాబితాను పట్టుకుని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఉదయలక్ష్మి రాండమ్ గా కొందరికి ఫోన్ చేసి బాబూ నేను ఫలానా,...నీకు స్కాలర్ షిప్ వచ్చిందా? ఆ సంస్థలో ట్రైనింగ్ తీసుకుంటున్నావా? బాగా చదువుకుని మంచిగా అభివృద్ధిలోకి రావాలి అంటూ ఇంకేదో చెప్పబోతుండగా సదరు విద్యార్థులు ... మీరెవరు? నాకు స్కాలర్ షిప్ రావడం ఏంటీ? అసలు ఆ ట్రైనింగ్ సెంటరే మా ఊళ్లో లేదు... అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఉదయలక్ష్మికి షాక్ కొట్టింది. ఇదేదో పొరపాటైనట్లుందని మరి కొందరు లబ్ధిదారుల నంబర్లకు ఫోన్ చేయగా అక్కడా ఇలాంటి సమాధానమే ఎదురైంది. దీంతో మొత్తం పథకం అమలు తీరును తవ్వితీయగా కోట్లాది రూపాయల నిధులను బినామీల పేరుతో కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, సంస్థ ఎండీ అమరేంద్రలు నొక్కేసినట్లు తేలింది. అంతేకాకుండా రామానుజయ బంధువులు, స్నేహితులే ఎక్కువమంది ఈ పథకానికి అప్లయి చేసి లక్షల రూపాయలను నొక్కేసినట్లు తెలిసింది. అంటే ఈ పథకం కొంద వచ్చిన కోట్లాది రూపాయలు కేవలం కొందరు నాయకులు, అధికారులు కలిసి కుమ్మక్కయి మింగేయడంతో జిల్లాల వారీగా అభ్యర్థులకు ఎలాంటి సాయమూ అందలేదన్నమాట. ఇక్కడ జిల్లాల్లో వేలాదిమంది అభ్యర్థలు పథకం కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటే అక్కడ హాయిగా పెద్దలంతా కలసి నిధులతో పండగ చేసుకుంటున్నట్లు ఆధారాలతో సహా వెళ్లడైంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నది సుస్పష్టం. ఇప్పటికే వెల్లడైన పలు స్కాముల్లో నిందితులను చంద్రబాబు ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడూ ఇదే జరుగుతుందన్నది అందరిలోనూ ఉన్న నమ్మకం. ఈ విధంగా కాపు కార్పోరేషన్ పేరిట కేవలం చైర్మన్ రామానుజయ మాత్రమే బాగుపడ్డారు తప్ప జిల్లాల్లోని కాపులెవరికీ పథకం అందలేదన్నది మరోసారి రుజువైంది. దీంతో మా కాపులకు అన్యాయం జరిగిపోయిందిరో దేవుడో..అంటూ వాళ్లు ఆవేదన చెందుతున్నారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock