Thursday, 24 August 2017 | Login

శ్రావణ లక్ష్మీ రావమ్మా...

నేడు ఇళ్లలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

వాస్తవం ప్రతినిధి:తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లకు శ్రావణ శోభ తాకింది. అతివలంతా శ్రావణమాసం రెండో శుక్రవారంనాడు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. దీంతో మార్కెట్లు, పూలదుకాణాలు, బట్టలు, బంగారం దుకాణాలు కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతున్నాయి.

ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కో చామంతిపువ్వూ మూడు రూపాయలకు అమ్ముతున్నారు. శ్రావణమాసంలో శ్రావణ శుక్రవారం పూట మహిళలు అమ్మవారిని నిష్టతో పూజించడం ద్వారా అష్టఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. ఆ రోజు దుర్గాదేవిని ఆలయంలో సందర్శించుకున్న వారికి పుణ్యఫలితాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. దీంతో బాటు పట్టణాల్లోని లక్ష్మీనారాయణులు కొలువైన ఆలయాల్లోనూ విపరీతమైన రద్దీ నెలకొంది.  విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు.  భద్రాచలంలో రామాలయం ప్రాంగణంలోని శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారికి అభిషేకం,సామూహిక లక్ష కుంకుమార్చనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కాసులు, ఇంకా అవకాశం ఉన్నవారు ఆభరణాలు, కొత్త చీర కొనుగోలు చేసి శ్రీలక్ష్మికి సమర్పించారు. అమ్మవారిని 108 నామాలతో పూజిస్తాం. ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత. వేదాల్లో వాటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీ మాత వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి అద్భుతంగా చెప్పబడింది. అమ్మవారి పూజలో పదహారు శ్రీ సూక్తాలున్నాయి. ఉపచారాలున్నాయి. ఆ పూజ అమేయ శక్తినిస్తుంది. అనేక శుభాలను ఒనగూరుస్తుంది. ధనలాభం, సౌభాగ్యం, విద్య, సంసార సౌఖ్యం, వాగ్ధాటి, వాహన ప్రాప్తి, శరీరకాంతి, ధైర్యం... ఇలా పదహారు ప్రయోజనాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీ దేవిని బిల్వ నిలయ అంటారు. బిల్వవృక్షం వద్ద యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. అప్పుడు రాక్షసులు చెట్టు దాకా రాగలరు. ఏ ఆటంకం కలిగించలేరు. అమ్మవారు నిర్దాక్షిణ్యంగా కట్టడి చేసి యజ్ఞ కార్యానికి ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. అంతటి ప్రభావాన్వితమైన వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల సిద్ధి, బుద్ధి, శక్తి, సంపదలు సంప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం.

==

 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock