Thursday, 24 August 2017 | Login

జీవితసత్యం! 

 రామాయణాన్ని మనం ఒక కథగా కాకుండా దాని అంతరార్ధాన్ని గ్రహించాలి. శ్రీరాముడు పరమాత్మ, సీత జీవాత్మ. ప్రతి మానవుని దేహం లంకా నగరం.లంకా ద్వీపమనే ఈ దేహంలో బంధింపబడిన సీత అనే జీవాత్మ శ్రీరాముడనే పరమాత్మని చేరుకోవాలని కోరుకొంటుంది. కాని రాక్షసులు దానిని జరుగనీయరు. రాక్షసులు అంటే మానవుని గుణములు. సత్వగుణము విభీషణుడు, రజోగుణము రావణుడు, తమోగుణము కుంభకర్ణుడు, రజో, తమోగుణములు సీత అనే జీవాత్మను శ్రీరాముడనే పరమాత్మతో కలుసుకోనీయకుండా దేహమనే లంకలో బంధించి ఉంచేయి. 

ఇట్లు బంధింపబడి శ్రీరాముని కలుసుకోగోరే సీతకు మార్గమేర్పడుతుంది.  అంటే గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గాన్ని చూపిస్తుంది. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే ముందు ఈ ఇహలోకపు చింత తొలగాలి. మనసు ఎప్పుడూ లోకిక విషయాలలోనే తగులుకొని ఉండిపోయినప్పుడు ఆధ్యాత్మిక చింతన వెగటుగా తోస్తుంది. దీనికి ఉదాహరణగా ఓ చక్కని కథను మనం పరిశీలిస్తే ఓ జీవిత సత్యాన్ని మనం కనుగొనగలం. జీవిత పరమర్ధం అవగతమౌతుంది. ఓ చీమ ఆహారం కోసం వెతుక్కొంటూ ఓ ఇంట్లో మూత తీసిఉన్న ఉప్పు సీసాలో దూరింది. ఇంతలో సీసా మూత వేసేయడం జరిగింది. అలా అది అందులోనే బంధింపబడిపోయి ఆ ఉప్పునే తింటూ బ్రతకసాగింది. అనుకోకుండా ఓ సారి మళ్ళీ ఆ సీసా మూత తీయడం జరిగింది. వెంటనే ఆ చీమ బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన చీమకు ఓ లావైన ఉల్లాసంగా ఉన్న చీమ కనబడింది. అది ఆ చీమను చూసి " ఏం మిత్రమా నీవంత చిక్కిపోయి విచారంగా కనబడుతున్నావు . తిండికి లోటుగా ఉందా ?" అని సందేహపూర్వకమైన సానుభూతితో అడిగింది. అంతేకాదు, ఆ చీమను తన నివాసానికి ఆహ్వానించింది ఆ కండగల చీమ. ఇంతకీ ఆచీమ ప్రస్తుత నివాసం ఓ పంచదార బస్తా. అలా ఆ పంచదార బస్తాలో రెండు రోజులున్నా  ఆ అథిధి చీమ ఇంకా ఎక్కువ క్రుంగిపోతూ సంతోషం లేకుండా కనపడింది. ఆ గృహస్తు చీమ ఆతృతతో బాధపడుతూ ఆ అతిధి చీమ విచారానికి కారణమేమిటని అడిగింది. దానికి ఆ చీమ మిత్రమా, ఇక్కడ అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కానీ ఈ ఆహారమే నాకు రుచించడంలేదు అంది. 

ఆ గృహస్తు చీమకు ఆశ్చర్యం కలిగింది." తియ్యదనానికి మారు పేరైన పంచదార రుచించకపోతే మరింకేది తియ్యగా అనిపిస్తుంది? అని దగ్గరగా పరిశీలించి ఆ అతిధి చీమ నోట్లో ఇంకా కొన్ని ఉప్పు కణాలు ఉన్నట్లు కనుగొనింది. ఎలాగో వాటిని తీసివేయగలిగింది. అప్పుడు ఇంతవరకూ తీయగా లేని పంచదార ఆ చీమకు ఎప్పుడూ రుచి చూడనంత అతి తీయనిదిగా అనిపించింది.

  ఐహిక సుఖ వాంచలనే ఉప్పు కణాలు మన నొట్లో ఉన్నంత కాలం ఆధ్యాత్మిక చింతన అనే పంచదార మనకు వెగటుగా తోస్తుంది. ఎప్పుడైతే మనం ఐహిక సుఖవాంచలను విసర్జిస్తామో అప్పుడే మనకు ఆధ్యాత్మిక చింతన అనే పంచదార అతి మధురంగా అనిపిస్తుంది. 

విషము విషము కాదు విషయ సుఖాపేక్షయే నిజమైన విషం. విషము ఇప్పటి శరీరాన్నే నశింపజేస్తుంది. కానీ విషయ సుఖాపేక్ష రాబోవు జీవితములో కూడా హాని చేస్తుంది. 

నేటి ప్రపంచంలోని మొత్తం సుఖం శతాబ్దానికి ముందు కంటే ఎక్కువైందా? లేదా? ఎక్కువవడానికి వీలులేదు. సముద్రంలో లేచే ప్రతి కెరటానికీ ఒక పల్లమేర్పడక తప్పదు. ఒక చోటున పల్లమేర్పడక మరో చోటున కెరటం లేవడం సాధ్యం కాదు . ఒక జాతి ధనవంతమూ,శక్తివంతమూ అయితే మరెక్కడో ఒక జాతి  ఆ మేరకు నష్టపడవలసిందే. మనము కనిపెట్టే ప్రతి యంత్రమూ ఇరవై మందిని ధనవంతులుగా చేస్తే ఇరవై వేలమందిని దరిద్రులుగా చేస్తుంది. ఇది అన్ని చోట్లా గల పోటీ సూత్రం అంతటా కనబడే శక్తి పరిమాణం ఒక్కటే. దు:ఖం లేకుండా సుఖం కలుగజేయవచ్చుననుకోవడం హేతు విరుద్దం. పిచ్చి సాహసపు పని.

 ఈ అన్ని రకాల సాధనాల పెంపుతో ప్రపంచంలోని కొరతలెక్కువవుతున్నాయి. కొరతలెక్కువవడం అంటే తీరని దాహాన్ని కలుగజేయడమే. ఈ కొరతనూ, తృష్ణనూ తీర్చగలిగినదేది! ఈ తృష్ణ యున్నంతకాలం దు:ఖం తప్పదు. వంతులవారీగా సుఖదు:ఖాల్ని అనుభవించడమే జీవిత లక్షణం. జీవిత స్వభావమే అంత. ఈ జీవిత సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే చాలు.   

 రచన....మురళీధరశర్మ పతి  

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock