Thursday, 24 August 2017 | Login

ధనుర్మాస వైశిష్ట్యం 


సూర్యుడు ప్రతినెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు ధనూ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మకర రాశిలో ప్రవేశించే వరకూ ఉన్న కాలాన్నే ధనుర్మాసం అంటారు. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. భోగి తో ముగుస్తుంది. ధనుర్మాసం చాలా పవిత్రమైనది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం. అందుచేత ఈ మాసం పూర్తిగా విష్ణుమూర్తిని పూజించి ఆయన అనుగ్రహం పొందాలని శాస్త్రాలు అభిలషిస్తున్నాయి.ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది.

ఈ ధనుర్మాసంలోనే శ్రీ విల్లి పుత్తూరు లో విష్ణుచిత్తుని (ఆళ్వార్) కుమార్తెగా పెరిగిన లక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి (ఆండాళ్) శీ మహావిష్ణువైన రంగనాధుడిని పెళ్ళాడాలని సంకల్పించి ధనుర్మాస వ్రతం ఆచరించి రోజుకో పాశురం చొప్పున 30 రోజులూ 30 పాశురాలతో విష్ణుమూర్తిని కీర్తించి వాటిని ఆయనకే అంకితం చేసింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై గోదాదేవిని శ్రీరంగం రమ్మనాడు . ఆమె తన తండ్రితో శ్రీరంగం వెళ్ళి అక్కడ రంగనాధుని పెళ్లాడి ఆయనలో ఐక్యమై పోయింది.
తిరుమలలో ధనుర్మాసం నెలరోజులూ సుప్రభాతం బదులు ఆండాళ్ రచించిన తిరుప్పావై గానం చేస్తారు. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్ధం.
ఈ మాసంలో ఇళ్ళ ముందు ఆవుపేడతో కళ్లాపు చల్లి రంగవల్లులు తీర్చిదిద్ది వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బిళ్లను పెడతారు. గొబ్బిళ్లమీద ఈ కాలంలో పూసే రకరకాల పూలను అలంకరిస్తారు. ఇలా సంక్రాంతి పండుగ వచ్చేంతవరకూ అందరూ తమ తమ ఇళ్ల ముందు రంగవల్లులతో అలంకరించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. చలికాలంలో సూక్ష్మ క్రిములు విజృంభిస్తాయి. ఆవుపేడతో కళ్లాపు చల్లితే ఆ సూక్ష్మ క్రిములు నాశనం అవుతాయి. ఇది సైన్స్ ప్రకారం.
కన్యలు ధనుర్మాసం లోని 30 రోజులూ దీక్షతో ఆ దేవదేవుడిని పూజిస్తే గుణవంతుడైన భర్తను పొందవచ్చునని పెద్దలు చెబుతున్నారు. ధనుర్మాస వ్రతం చేయడంవల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసర పప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువల్ల ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వల్ల సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.
..................x..................x......................x..........................

                                                                                                                            సంకలనం ..... మురళీధరశర్మ పతి

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock