Thursday, 24 August 2017 | Login

కార్తీక మాస విశిష్టత

" న కార్తీక సమా మాసౌ న శాస్త్రం నిగమాత్పరం
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః"


కార్తీక మాసముతో సమానమైన మాసముగానీ వేదములకంటే అన్యమైన శాస్తము గానీ, ఆరోగ్యముతో సమానమైన ఉత్సాహం గానీ, కేశవునికంటే అన్యమయిన దైవము గానీ లేవు.
" సంవత్సరములో ఉత్తమమైన మాసము ఏది? పూజంప వలసిన దైవం ఎవరు? దర్శించవలసిన క్షేత్రం ఏది? " అని నారదుడడిగిన ప్రశ్నలకు సమాధానంగా బ్రహ్మదేవుడు " మాసాలలో కెల్లా ఉత్తమైనది కార్తీకమాసం. పూజింప వలసిన దైవాలు శివ కేశవులు. దర్శించవలసిన క్షేత్రం బదరీ " అని చెప్పినట్లు స్కంద పురాణం లో ఉంది.

కార్తీక మాసం శరదృతువు రెండో భాగంలో వస్తుంది. వర్ష ఋతువు తర్వాత శరదృతువు రావడంతో పాటుగా అప్పటికి వర్షాలు ఆగిపోయి వాతావరణం పొడిగా మారి ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని పుణ్య, శుభకార్యాలకూ అనువైన మాసం. ఈ మాసం శివ కేశవులిద్దరికి ఎంతో ప్రీతికరమైనది.
కార్తీక మాసంలో తెల్లవారు ఝాముననే లేచి తలకు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివ కేశవుల్ని పూజించాలి. ఈ మాసంలో తులసి కోటకు పూజ చేయడం కూడా అత్యంత పుణ్యప్రదం.

" కార్తికేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్ధన
ప్రీత్యర్ధ తవదేవేష దామోదర మయ సహః"

అను శ్లోకం చదువుతూ స్నానం చేయాలి.
" ఓ జనార్ధనా, దేవదేవా, దామోదరా! లక్ష్మీ సహేతుడవైన నీ ప్రీత్యర్ధం నేను ఈ కార్తీక మాసంలో ప్రాతః స్నానం ఆచరిస్తున్నాను. " అని అర్ధం.

నదీ స్నానం గాని, సముద్ర స్నానం గాని ఉత్తమం. ఎందుకంటే ఈ మాసంలో గంగాదేవి, విష్ణుమూర్తీ అన్ని నదులలోనూ, సముద్రంలోనూ, సెలయేళ్లలోనూ, జలాశయాలలోనూ, ప్రవేశించి ఉండడం వలన వాటిలో స్నానం చేసేవారు పునీతులవుతారు.

కార్తీక మాసం అంతా పర్వదినాలే. ముఖ్యంగా సోమవారాలు శివునికి ప్రీతికరం.
శివుడు అభిషేక ప్రియుడు. ఈ సంవత్సరం 5 సోమవారాలు వచ్చేయి. కార్తీక పౌర్ణమి కూడా సోమవారం అయింది. సోమవారాలు శివుడికి అభిషేకం, అర్చన చేసి పగలంతా ఉపవాసం ఉండి శివనామస్మరణ చేస్తూ సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత శివదర్శనం చేసుకొని అప్పుడు భుజిస్తారు.

ఈ మాసంలో మొదటి రోజు తిధి బలి పాడ్యమి. ఆకాశదీప ప్రారంభం.
రెండవరోజు విదియ నాడు యమ ద్వితీయ భగినీహస్తభోజనం అని సోదరులు తమ సోదరీమణుల ఇంట భోజనం చేస్తారు. అలా చేసినవారికి అపమృత్యుభయం ఉండదని యమ ధర్మరాజు తన సోదరి యైన యమునకు వరమిచ్చేడు.
మూడవరోజు తదియనాడు భాత్రు తృతీయ. సువాసినీ పూజ .సోదరులు తమ సోదరీమణులకు గాని, సువాసినులకు గాని పూజ చేస్తారు.  
తరువాత వచ్చేది నాగుల చవితి.
ఈ మాసంలో ముఖ్యమైనది ఉత్థానఏకాదశి. ఆషాఢ శుద్ద ఏకాదశి నాడు శయనించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ద ఏకాదశి నాడు నిదురనుండి లేస్తాడు. అందుకే దాన్ని ఉత్థానఏకాదశి అన్నారు. ఏకాదశీ వ్రతం చేసేవారు ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి భవన్నామస్మరణతో రాత్రంతా జాగరణ చేసి మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు వ్రతోద్యాపన చేస్తారు.
ఇక కార్తీక పౌర్ణమి. శివుడు త్రిపురాసురుని సంహరించిన రోజు. కేదారేశ్వర వ్రతం చేస్తారు. ఇంటిముందు అందమైన రంగు రంగుల ముగ్గులు వేసి దీపాలు పెడతారు. దీపదానం చేస్తారు. ఈ మాసంలో చేసిన దానాలకు విశేషమైన ఫలితం ఉంటుంది. దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. నదులలోనూ, సెలయేర్లలోనూ, తటాకాల్లోనూ అరటి దాపులలో నేతితో దీపాన్ని వెలిగించి వదులుతారు. ఈ మాసంలోనే అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి.
ఇక ఈ మాసపు ప్రత్యేక ఆకర్షణ వనభోజనాలు.

" కార్తీకేసితే వనభోజన మాచరేత్
సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే"

కార్తీక మాసంలో వనభోజనాలు చేసినవారు అన్ని పాపముల నుండి విముక్తులై విష్ణుధామాన్ని చేరుకొంటారు.
ఈ మాసంలో ఉసిరి చెట్టుకింద వన భోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు అనేక ఔషదగుణాలు కలదీ, దామోదరునికి ప్రీతికరమైనదీ. అంచేత దానినీడలో చెట్టుమొదట్లో విష్ణుమూర్తి చిత్రపటాన్ని గాని, విగ్రహాన్ని గాని ఉంచి పూజచేసి తర్వాత భోజనాలు చేస్తారు. సూతుడు, శౌనకాది మునులతోనూ, శ్రీకృష్ణుడు బలరామ సమేతంగా గోపబాలురతోనూ బృందావనంలో వనభోజనాలు చేయడం జరిగింది.
ఈ వన భోజనాలు స్నేహాన్ని, సమైక్యతనూ మానవ సంబందాలనూ మెరుగుపరుస్తాయి.
ఇంతటి విశిష్టత గల కార్తీక మాసం ఉత్తమమైనదనడంలో అతిశయోక్తి లేదు.

                                                            సంకలనం ... మురళీధర శర్మ

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock