Thursday, 24 August 2017 | Login

ఖర్చు తగ్గింది అంటూ...రష్యా కి థాంక్స్ చెప్పిన ట్రంప్  

వాస్తవం ప్రతినిధి: ఇటీవల రష్యా నుండి 750మందికి పైగా అమెరికా దౌత్య సిబ్బందిని బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎలా స్పందిస్తారో అని భావించగా ఆయన రష్యా నేత పుతిన్‌కి కృతజ్ఞతలు తెలియచేయడం విశేషం.

పెద్ద సంఖ్యలో సిబ్బందిని బహిష్కరించడం వల్ల ఇప్పుడు తమకు ఖర్చు తగ్గుతుందని, అందుకు కృతజ్ఞతలని ట్రంప్‌ గురువారం వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను అమెరికా మాజీ, ప్రస్తుత అధికారులు విమర్శించారు. అమెరికా ఎంబసీ, కాన్సులేట్‌ సిబ్బందిని పెద్ద మొత్తంలో తగ్గించాలంటూ జులై 30న పుతిన్‌ ఆదేశించారు. అయితే వారు వెనక్కు వెళ్ళడానికి సరైన కారణం లేనప్పటికీ,మాకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతోందని న్యూజెర్సీలోని బెడ్‌ మినిస్టర్‌లోని గోల్ఫ్‌ క్లబ్‌లో విలేకర్లతో ట్రంప్‌ మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలు వింతగా వున్నాయని అమెరికా మాజీ విదేశాంగ శాఖ అధికారి నికొలస్‌ బర్న్స్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ జోక్‌ చేస్తున్నారనుకుంటే ఆయన తెలుసుకోవాల్సింది మరింత వుందని, ఒకవేళ ఆయన జోక్‌ చేయడం లేదనుకుంటే, ఈ వ్యాఖ్యలు కనివినీ ఎరుగనిరీతిలో ఉన్నాయి అని నికోలస్ వ్యాఖ్యానించారు. దౌత్య సిబ్బందిని బహిష్కరించడాన్ని అధ్యక్షుడు సమర్థించడం గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు. ఈ బహిష్కరణలను అధ్యక్షుడు సానుకూలంగా ఎలా చూస్తున్నారో అర్ధం కావడం లేదని మాజీ విదేశాంగ అధికారి హెతర్‌ కాన్లే వ్యాఖ్యానించారు.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock