‘తెల్లవారితే గురువారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “సీఎం, సీఎం” అంటూ ఎన్టీఆర్   అభిమానులు నినాదాలు  

వాస్తవం ప్రతినిధి:  ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్నకుమారుడు శ్రీసింహా కోడూరి నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగ్గా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఎన్టీఆర్ ను చూడగానే అభిమానుల్లో సంతోషం అంబరాన్నంటింది. వారు “సీఎం, సీఎం” అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ ఉత్సాహం వెలిబుచ్చారు. తారక్ ఓవైపు కీరవాణి తనయులు శ్రీసింహా, కాలభైరవ గురించి మాట్లాడుతుండగా, అభిమానులు మాత్రం సీఎం నినాదాలతో హోరెత్తించారు.
తనకెంతో ఇష్టులైన కీరవాణి కుటుంబసభ్యుల గురించి మాట్లాడుతున్నటప్పుడు సీఎం అంటూ అభిమానులు కోలాహలం సృష్టించడం ఎన్టీఆర్ ను కాస్తంత అసహనానికి గురిచేసింది. ఆయన వెంటనే ప్రసంగం ఆపి… “ఆగండి బ్రదర్, ఆగమని చెప్తున్నాను కదా” అంటూ మందలించే ప్రయత్నం చేశారు. అప్పటికి గానీ అభిమానుల నినాదాలు సద్దుమణగలేదు.