విశాఖ  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: పవన్ కల్యాణ్ 

 వాస్తవం ప్రతినిధి: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కసారి భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు, రాజీనామాలతో ఉక్కు నినాదం ఉవ్వెత్తున ఎగసి పడింది. ఎవరు ఎలా స్పందిస్తున్నా… కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ చర్యలు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రక్రియ పూర్తి చేయాలన్న స్పీడ్‌గా పని చేస్తున్నట్టు సమాచారం.
  ఈ అంశంపై తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో వైసీపీ  ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఓ వీడియో ద్వారా ఆయన ఈ మేరకు స్పందించారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనల మధ్యే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని… ఆ పార్టీకి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ మరింత బాధ్యతతో స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని… స్టీల్ ప్లాంట్ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనలు, భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చ జరపాలని అన్నారు. 22 మంది ఎంపీలున్న వైసీపీ ఢిల్లీ వేదికగా స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు.