రాష్ట్రపతి తో రఘురామకృష్ణరాజు భేటీ    

 వాస్తవం ప్రతినిధి:వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఈరోజు కలిశారు. ఈ విషయాన్ని రఘురాజు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు సమయాన్ని కేటాయించిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేశారు. కక్షసాధింపుల్లో భాగంగా తనపై ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టించిందనే విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ కేసుల నుంచి తనను రక్షించాలని కోరానని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు.
తనను సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా చేస్తున్నారంటూ కొంత కాలంగా రఘురాజు సొంత పార్టీపైనే మండిపడుతున్న సంగతి తెలిసిందే. స్థానిక నేతల చేత తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో అడుగు పెడితే అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారని చెపుతున్నారు.