త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీలేని రుణాలు:   హరీష్ రావు  

 వాస్తవం ప్రతినిధి: మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించడమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందులో భాగంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీలేని రుణాలను విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగధాంపల్లిలో సుతారి సంఘం, మహిళా మండలి భవనం, ముదిరాజ్ సంఘం భవనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రంగాధాం పల్లిలో 12 కుల సంఘాల భవనాలు నిర్మించామని తెలిపారు. 9వ మున్సిపల్ వార్డులో రూ.9 కోట్లు నిధులతో వివిధ అభివృద్ది పనులను చేశామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్‌లు రావడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు మెరగయ్యాయన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం కాకుండి రాష్ట్రం నలుమూలాల విస్తరించేందుకు సీఎం కేసీఆర్ కృషీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.