అంగన్‌వాడీ కేంద్రంలో పాముకాటు తో మూడేళ్ల  చిన్నారి  మృతి ‌

వాస్తవం ప్రతినిధి: మూడేళ్ల ఓ చిన్నారి అక్కతో కలిసి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. పిల్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో పాము కాటేసింది. సరైన సమయంలో వైద్యం అందక ఆ పసిపాప కన్నుమూసింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో రామవరపుమోడిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..
 రామవరపుమోడి గ్రామానికి చెందిన నాగ అనూష, నాగ మల్లేశ్వరరావు భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె పేరు వర్షిణి (4), చిన్న కుమార్తె పేరు స్నేహ స్వాతి (3). వర్షిణి ప్రతి రోజు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లుంది. ఐతే మంగళవారం స్నేహస్వాతి తన అక్కతో పాటు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది.
అక్కడ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో…  పక్కనే ఉన్న ఓ పాము స్వాతిని కాటేసింది. నొప్పితో చిన్నారి ఏడవడంతో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది ఇంటికి పంపించారు. కానీ పాము కరించిందని ఎవరికీ తెలియదు. పాప ఏడూస్తూ చేయి చూపించడంతో.. పాము కరిచిందని తల్లిదండ్రులు అనుమానించి  మచిలీపట్నం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లుండగా మార్గమధ్యలోనే అంబులెన్స్‌లో కన్నుమూసింది. స్నేహస్వాతి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.