ప్రేక్షకులు లేకుండానే చివరి మూడు టీ20లు    ‌

    వాస్తవం ప్రతినిధి: ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి మూడు టీ20లు స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న చివరి మూడు మ్యాచ్ లను క్లోజ్డ్ డోర్స్ లో నిర్వహించాలని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయించామని బీసీసీఐ తెలిపింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంది. స్థానిక వైద్యాధికారులతో కూడా బీసీసీఐ చర్చలు జరిపింది.
    కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బీసీసీఐ ఈ సందర్భంగా తెలిపింది. చివరి మూడు టీ20లకు టికెట్లు కొన్న వారికి డబ్బులు చెల్లిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పింది.