భరోసా ఇచ్చి కాదు..భయపెట్టి గెలిచారు: పవన్ కళ్యాణ్ 

వాస్తవం ప్రతినిధి: ఏపీలో వచ్చిన మున్సిపల్ ఫలితాలు, కార్పొరేషన్ ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది నిజమైన గెలుపు కాదన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చి సాధించిన గెలుపు కాదు, ఇది బెదిరింపుల గెలుపు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
అత్యధిక మున్సిపాలిటీలు, మొత్తం కార్పొరేషన్లు వైసీపీ దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒక జనసేన ఊసే ఎక్కడా లేదు.  తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తప్ప జనసేన పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
వైకాపా విజయాలు నిజమైనవి కావు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఓటు వెయ్యకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని, ఇంటి స్థలం ఇవ్వమని బెదిరించి భయపెట్టారు.  కడుపుమీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించిందని పవన్ ఆరోపించారు. వైసీపీ బెదిరింపులకు బలంగా బదులిస్తామని పవన్ స్పష్టం చేశారు.