భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త..బైడన్ కీలక ఆదేశాలు

    వాస్తవం ప్రతినిధి: భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో తీపి కబురు అందించారు. హెచ్‌-1బీ వీసాల వేతనాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు. హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్‌ సర్కారు గతంలో తెచ్చిన నిబంధన అమలును మరింత ఆలస్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కార్మిక శాఖ శుక్రవారం ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్‌లో, మే 14 వరకూ దీని అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తమ నిర్ణయం అమెరికాలోని కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాలను కాపాడనుందని తెలిపింది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణులకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కాలపరిమితిని మరింత ఆలస్యం చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇది మే 14 నుండి అమలులోకి రానుందని తెలిపింది. దీన్ని పొడిగించేముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని పేర్కొంది.