భజే విశ్వనాదం.. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా..

ధీ అంటే బుద్ధి… యానం అంటే ప్రయాణం… బుద్ధితో కలిసి ప్రయాణించడమే ధ్యానం. తుమ్మెదలు తమ చుట్టూ తిరిగే కీటకాలన్నిటికీ తమ లక్షణాన్నే ఆపాదిస్తాయి. దాన్నే భ్రమరకీటన్యాయం అంటారు. శివభక్తి కూడా అలాంటిదే… బుద్ధిని శివుడిలో నిలిపి ధ్యానం చేసేవాడు సాక్షాత్తు శివుడే అవుతాడని చెబుతారు పెద్దలు. ఆయన భోళా శంకరుడు… కోరినవన్నీ ఇచ్చేస్తాడు. ఆయన భక్తవశంకరుడు… ఇట్టే కరిగి భక్తుల ముందు వాలిపోతాడు. అంతేనా… ఈ విశ్వంలోని అణువణువూ ఆయన చైతన్యానికి నిదర్శనమే. ప్రతి కదలికా ఆయన తాండవమే… ఆ మహా రుద్రుణ్ణి స్మరించే రోజు… శివరాత్రి..

ఆయనలా… ఆమె ఇలా…

అనగనగా ఓ ఇంటాయన… ఇంటావిడ ఆయనేమో మహా భోళా… ఆవిడేమో ఆయన అడుగు జాడ… దేవతలు వచ్చి విషం చేతికిచ్చి… ‘అయ్యా! ఇది మమ్మల్ని దహించి వేస్తోంది. లోకం సర్వనాశనమవుతోంది. మీరే ఆదుకోగల సమర్ధులు. జన సంరక్షణలో మీదే మొదటి స్థానం’ అని పొగిడారు. ఆయన అంత కాలకూటాన్నీ నేరేడు పండులా అరచేతిలోకి తీసుకున్నాడు. ఒక్కసారి భార్య ముఖంలోకి చూశాడు. ఆ తల్లి వద్దనలేదు. ‘ప్రజల క్షేమం కోసమే కదా. ఫర్వాలేదు. మింగెయ్యి…’ అందావిడ మంగళసూత్రాన్ని ఓసారి కళ్లకద్దుకుని. ఈ సన్నివేశానికి అద్భుతమైన పద్యరూపాన్నిచ్చాడు మహాకవి పోతన.

‘మ్రింగెడువాడు విభుండని, మ్రింగెడిది గరళమనియు, మేలని ప్రజకున్‌, మ్రింగమనె సర్వమంగళ! మంగళసూత్రంబునెంత మది నమ్మినదో!’ ఆమెను సర్వ మంగళ అనడంలో ఉంది ఆయువుపట్టు. పుస్తెలతాడు మీద ఆమెకు ఎంత నమ్మకమో… అనేది పైకి కనిపించే అర్థం. కానీ సూత్రం అనే మాటకు సిద్ధాంతం అనే అర్థం కూడా ఉంది. లోకాలన్నీ సురక్షితంగా ఉండాలన్నది ఆమె సూత్రం. మంగళకరమైన ఆమె భావనల కారణంగానే ఆమె సర్వమంగళ అయింది. ఇదీ పార్వతీపరమేశ్వరుల త్యాగసంసిద్ధత. ఇంత త్యాగం ఎందుకంటే… వారిద్దరూ ఈ జగత్తుకే తల్లిదండ్రులు కాబట్టి… ‘జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అన్నాడు కాళిదాస మహాకవి. ఎప్పుడు పుట్టారో తెలియని ఆది మహా దంపతులు వారు. ఆయన భక్తవశంకరుడైతే… ఆమె కారుణ్య శాంకరి

ఎవరేది కోరితే అది…
ఒంటి నిండా బూడిదపూత, మెడలో కాలసర్పం, కంఠానికి కంకాళాల దండ, దేహానికి జంతుచర్మం! ఇదీ ఆ పెద్దాయన స్వరూపం. భీకరమైన ఆ రూపమే లోకానికి పరమ ప్రీతికరం. ఆయన సకల జంతుకోటికీ ఆరాధ్య దైవం. స్వభావరీత్యా ఆయన భక్త సులభుడు. సాలె పురుగు ఏ వేదాలూ చదవలేదు. నాగుపాటు ఏ శాస్త్రాలూ మధించలేదు. ఏనుగు చదువులెంతో ఎవరికీ తెలియదు. ఏ మంత్రం తెలియని కన్నప్ప పరమేశ్వర సాయిజ్యాన్ని పొందాడు. అదే శివ కారుణ్యం. నీలకంఠుని శిరస్సుపై ఇన్ని నీళ్లు చల్లి.. కాసింత పత్రి భక్తితో అర్పిస్తే చాలు వరాల కల్పవృక్షాన్ని పెరట్లో పాతేసుకోవచ్చు. అంత భక్త సులభుడాయన.
దైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలకు ముందు ధ్వజారోహణం ఉంటుంది. శైవక్షేత్రాల్లో నంది ధ్వజాన్ని ఎగరేస్తారు. శ్రీకాళహస్తిలో ఇంకో పరమ విశేషం ఉంది. ఏటా శివరాత్రికి జరిగే బ్రహ్మోత్సవాల్లో ద్వజారోహణం స్వామి కొలువుదీరిన ఆలయం వద్ద కాకుండా భక్త కన్నప్ప నివాసమైన కొండమీద జరుగుతుంది. దేవుడికి సమర్పించే ధ్వజారోహణ కైంకర్యం భక్తుడి ముంగిట జరగడం ఆ పరమేశ్వరుడి దయావీక్షణాలను చాటుతుంది.

విశ్వ చైతన్యం తాండవమాడితే…
శివుడు నాద శరీరుడు. ‘నాదతనుమ్‌ అనిశం శంకరమ్‌’ అంటూ త్యాగరాజస్వామి కీర్తించడంలోని విశేషం అదే. తాండవం పరమేశ్వరుడి నిత్యకృత్యం. రోజూ సాయం సంధ్యా సమయంలో ఆయన మహోత్సాహంతో చేసే వీర తాండవాన్ని బ్రహ్మాది దేవతలు పోటీపడి చూస్తుంటారని చెబుతారు. వివిధ వాద్యాలతో, తాళాలతో, దరువులతో జరిగే ఈ తాండవంతో కైలాసం కదిలిపోతుందని, ఆయన జటాజుటి చెల్లాచెదురై పోతుందని, తలపై గంగ గజగజలాడుతూ తొణికిపోతుందని, మూడోకన్ను తెరుచుకుంటూ అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయని వర్ణించారు. ప్రాణులన్నిటికీ ఆంగిక, వాచిక, సాత్విక, ఆహార్యమంతా ఈ తాండవంలోనే లభ్యమవుతుందని చెబుతారు.

దీన్ని శాస్త్రీయ దృక్పథంతో చూద్దాం….
అనుక్షణం తీవ్రమైన వేగంతో చలించే పరమాణువుల సమూహాలే వస్తువులన్నీ. ఆ చలనం కారణంగా శక్తి ఉద్భవిస్తుంది. అంటే విశ్వమంతా అనంతమైన శక్తి తాండవం చేస్తూ ఉంటుందన్నమాట,. ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం పరమాణు కణాలు అనుక్షణం ఉత్పన్నమవుతూ, నశిస్తూ ఉంటాయి. అంటే అనుక్షణమూ ఇవి సృష్టి స్థితి లయలను తాండవం చేస్తుంటాయని అర్థం. పరమాణువులోని సూక్ష్మ అంశాలు నిరంతరం జరిపే ఈ శక్తి తాండవానికి ప్రతీకే శివతాండవం. ఆ కోణంలో చూస్తే శివతాండవమంటే ఈ విశ్వ తాండవమే. అది అనంతంగా సాగే నిరంతర శక్తి ప్రవాహం. పరబ్రహ్మ స్వరూపుడైన శివుడు సర్వరూపాల్లోనూ ఉంటాడు కాబట్టి, తాండవం చేసే విశ్వమే శివుడు. ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు ఈ తాండవం నిరంతరం సాగుతూనే ఉంటుంది.

1972లో ఫ్రిట్జఫ్‌ కాప్రా అనే భౌతిక శాస్త్రవేత్త ఒక వ్యాసంలో మొదటిసారిగా పరమాణువుల శక్తి తాండవాలను శివతాండవంతో పోల్చాడు. ఆ తర్వాత తను రాసిన ‘ద టావో ఆఫ్‌ ఫిజిక్స్‌’ అనే ప్రఖ్యాత గ్రంథంలో ఈ విషయాన్ని మరింతగా విపులంగా వివరించారు. ‘‘వందల సంవత్సరాల క్రితమే భారతీయ కళాకారులు నృత్యం చేస్తున్న శివుని విగ్రహాలను తయారు చేశారు. అది నేటి ఆధునిక ‘కాస్మిక్‌ డ్యాన్స్‌’కు ప్రతీక. ప్రస్తుత కాలంలో భౌతిక శాస్త్రవేత్తలు కాస్మిక్‌ డ్యాన్స్‌ను వర్ణించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ‘ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు పరమ శివుని తాండవమంటే పరమాణువుల తాండవమే’ అన్నారాయన. ఏతావాతా శివతాండవం సర్వ ప్రాణుల, జడ పదార్థాల జనన మరణాలు అంటే సృష్టి, లయలకు సంకేతం. క్షేత్ర సిద్ధాంతం ప్రకారం ప్రతి పరమాణువూ దాని సంగీతమది పాడుతూ ఉంటుంది. శబ్దమే (ఓంకారం) బ్రహ్మమని, అదే సృష్టి, స్థితి, లయించడానికి కారణమని హిందూ మత గ్రంథాలు చెప్పిన దానికి నేటి భౌతిక శాస్త్రం చెబుతున్న అంశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అవును.. అది విశ్వ‘నాదం’

అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్‌ సాగన్‌ ‘కాస్మోస్‌’ అనే తన రచనలో నటరాజ తాండవం గురించి వివరిస్తూ అది విశ్వం అనంతమైన సృష్టి, వినాశనాలను సూచిస్తుందని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్‌ టీవీ సీరియల్‌ కాస్మోస్‌ను ఆయన తమిళనాడులోని చోళుల కాలం నాటి ఆలయాలే ఆలంబనగా చిత్రీకరించారు. అక్కడి నటరాజ కాంస్య విగ్రహాన్ని చూపుతూ ఈ విశ్వం సృష్టి వినాశనాలకు ఆ విగ్రహమే సంకేతమని వివరించాడు.

స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఉన్న ‘సెర్న్‌’ (యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ పార్టికల్‌ ఫిజిక్స్‌) పరిశోధనాలయంలో పరమాణువులపై పరిశోధన జరుగుతోంది. ఇక్కడ లార్జ్‌ హాడ్రన్‌ కొలైడర్‌ అనే భారీ పరికరం సహాయంతో శాస్త్రవేత్తలు దైవ కణం (హిగ్స్‌ బోసాన్‌) ఉనికిని గుర్తించారు. ఉప పరమాణు కణాలు, పరమాణువులు, అణువులు – వీటన్నిటికీ ద్రవ్యరాశినిచ్చేదే ఈ ‘దైవ కణం’ లేదా ‘హిగ్స్‌-బోసాన్‌ కణం’. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆ పరిశోధన కేంద్రం ఆవరణలో ఎత్తయిన రాతి దిమ్మెపై దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తయిన నటరాజ విగ్రహం ఉంటుంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయే నిజం దాని వెనుక దాగి ఉంది. భారత ప్రభుత్వం 2004లో ఈ విగ్రహాన్ని ‘సెర్న్‌’కు బహుకరించింది. శాస్త్రవేత్తలు దానిని తమ ఆవరణలో ప్రతిష్ఠించుకోవడం వెనుక ఎంతో తాత్వికతతో పాటు శాస్త్రీయ దృష్టి కూడా ఉండడం గమనార్హం. ఆ విగ్రహం కింద ఫలకం మీద శాస్త్రవేత్త ఫ్రిట్జఫ్‌ కాప్రా నటరాజు గురించి చెప్పిన మాటలను ప్రముఖంగా పేర్కొన్నారు.ప్రాచీన భారతావనిలో.. ప్రత్యేకించి చిదంబరం (తమిళనాడు)లో ప్రతిష్ఠితమైన నిలువెత్తు నటరాజ స్వరూపాన్ని చూస్తే మనసు ఆనంద తాడవమాడుతుంది. కుడి ఎడమలుగా గాలిలోనే నిలిచి ఉన్నట్లు కనిపించే ఆయన జటాజుటి చూస్తే శివతాండవం మెరుపు కంటే వేగంతో సాగుతుందని అర్థమవుతుంది. లయబద్ధంగా, శ్రుతిమధురంగా సాగే ఆనంద తాండవం ఆయనది. నాటి ఇతిహాసాలు మొదలు నేటి అత్యాధునిక విజ్ఞాన శాస్త్రాల వరకు ‘శక్తి’కి అనేక నిర్వచనాలు, వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటినీ మించి- లోకాలకు, కాలాలకు అతీతంగా అనిపించే మహత్తర శక్తి ఏదైనా ఉందా అంటే..అది నటరాజ రూపమే!

ప్రతి ప్రోటాన్‌ సృష్టి, లయలనే తాండవం చేస్తుంది.. దానికి ప్రతీక శివతాండవం.
– ‘ద వరల్డ్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ పార్టికల్స్‌’ అనే రచనలో శాస్త్రవేత్త కెన్నెత్‌ ఫోర్డ్‌.

క్షణంలోని శత, సహస్ర భాగంలో పరమాణువులు నిరంతరంగా నశిస్తూ, జనిస్తూ ఉండే లయ ఈ సకల సృష్టికి మూలం.. అది సృష్టిలో సమతూకానికి కారణమవుతుంది. లయతో కూడిన సృష్టి క్రమమే శివతాండవం. అదే భౌతికశాస్త్రవేత్తల దృక్పథం కూడా… – ఫ్రిట్జఫ్‌ కాప్రా
► పరమశివుడికి అయిదు ముఖాలని వేదం చెప్పింది. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన… వాటి పేర్లు. అయిదు రూపాలతో విశ్వమంతా శివచైతన్యం పరివ్యాప్తమై ఉంటుందనేది వైదిక భావన.
► రుద్రాధ్యాయంలోని మంత్రభాగాన్ని ‘నమకం’, ‘చమకం’గా పిలుస్తారు. ప్రతి మంత్రం చివర ‘నమో..’ ‘నమో..’ అని ఉన్న భాగాన్ని నమకం అంటారు. ప్రతి మంత్రం చివర ‘చ మే, చ మే’ అని ఉన్న భాగం ‘చమకం’ అని వాడుకలోకి వచ్చింది. ఈ నమక, చమకాలలో సారాంశాన్ని గ్రహించగలిగితే.. సృష్టి అంతా పరమేశ్వర స్వరూపమే అన్న అవగాహన కలుగుతుంది.
► తాండవంలో శివుడు ఢమరుకం మోగిస్తాడు. అది ఆయనకు ఇష్టమైన తాళవాద్యం. ఆ ధ్వనులను మహర్షులు గుర్తుపెట్టుకున్నారు. అవి పద్నాలుగు. వాటిని పరమేశ్వర సూత్రాలంటారు. పాణిని వంటి మహర్షులు వ్యాకరణం రాయడానికి ఈ సూత్రాలే ఆధారం చేసుకున్నామని వెల్లడించారు.
►శివనామ స్మరణం, రుద్రాక్షధారణం, విబూదిపూత… మూడూ శివచిహ్నాలు. వాటిని పాటించేవారిని తీర్థదేహులు అంటారు. అంటే తరించిన వారని అర్థం.

ఆ రోజు ఆ అయిదూ

♦️ ప్రతి నెలా అమావాస్యకు ముందు రోజు వచ్చే చతుర్దశి ఆ మాసానికి శివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి మహా శివరాత్రి అవుతుంది.
♦️ ఆ రోజు అర్ధరాత్రిని తురీయ సంధ్య అని పిలుస్తారు. అదే లింగోద్భవ కాలం. విశ్వమంతా వ్యాప్తమైన ఈశ్వరతత్త్వమే లింగమని నిర్వచించాయి శాస్త్రాలు. ఆ సూక్ష్మ భగవత్‌తత్వాన్ని ఆవిష్కరించుకునేందుకు అనువైన కాలమే ఈ తురీయ సంధ్యాకాలం.
♦️ స్నానం, మంత్రం, దయ, దానం, సత్యం, ఇంద్రియ నిగ్రహం, జ్ఞానం, మనశ్శుద్ధి… ఈ ఎనిమిది శౌచాలు శివరాత్రి రోజు తప్పనిసరిగా పాటించాలని చెబుతారు.
♦️ ఉపవాసం, జాగరణ… ఈ పవిత్ర దినంలో ముఖ్య నియమాలు. ఈ రెండూ శరీరాన్ని యోగ చైతన్యంతో నింపి ఈశ్వరతత్త్వ అనుసంధానానికి సహకరిస్తాయి. తాత్త్వికంగా చూస్తే అంతర్ముఖం కావడమే ఉపవాసం. ఆ ఏకాగ్రతలో పూర్ణ చైతన్యంతో తాదాత్మ్యం పొందడమే జాగరణ.
♦️ సంకీర్తనలతో, మంత్రాలతో, నామ జపంతో పరమాత్మను ఆరాధిస్తారు. ఏ రీతిలోనైనా మనసు మహాదేవుడి ఆధీనంలో ఉంచడమే అసలైన శివరాత్రి అవుతుంది.

– వెంకూ