అప్పుడు జగన్..ఇప్పుడు దీదీ..ఇదంతా పీకే పన్నాగమేనా ..??

  వాస్తవం ప్రతినిధి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో నిన్న దాడి జ‌రిగిన సంగతి విదితమే. ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆమె ఎడమకాలితో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. అంతేగాక‌, ఆమె ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పారు. మ‌రో రెండు రోజుల పాటు ఆమె వైద్యుల పర్యవేక్షణలో వుండాలని, ఆమెకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని వివరించారు.

  మరోవైపు ..అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం, ఓట‌ర్ల సానుభూతి పొందడం కోస‌మే ఆమె ఇటువంటి గిమ్మిక్కులు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఇదిలావుంచితే,

  ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్ బృందం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా అప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న సమయం లో జగన్ మీద కోడికత్తితో దాడి జరిగిన వ్యవహారాల్నీ,అలాగే కేజ్రీవాల్ మీద జరిగిన దాడి వ్యవహారాల్నీ ప్రస్తావిస్తూ   అలాగే దీదీపై కూడా దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు విషయానికొస్తే..

  అది.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న సమయం.. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీద ‘కోడి కత్తి’తో దాడి జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే విమానాశ్రయంలో ప్రతిపక్ష మీద దాడి జరగడమా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ ఘటనపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి అది హత్యాయత్నం. కానీ, వైఎస్ జగన్.. తన సొంత రాజకీయ లబ్ది కోసం ఆ దాడి చేయించుకున్నారని అప్పటి అధికార పార్టీ టీడీపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి, హోం మంత్రి డీజీపీ కూడా అదే కోణంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమయ్యింది అప్పట్లో. ఆ కేసు ఇప్పటిదాకా ఓ కొలిక్కి రాలేదు. దాడి ఎందుకు జరిగింది.? తెరవెనుకాల ఎవరున్నారు.? అన్నదానిపై బాధితుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక కూడా తేల్చలేకపోవడం మరీ విచిత్రం. అదంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ‘పన్నాగం’ అనే విమర్శ కూడా వుంది.

  అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో , అరవింద్ క్రేజీవాల్ మీద కూడా దాడి జరిగింది.. అక్కడా ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త. ఆయా పార్టీలకు ఎన్నికల సమయంలో వ్యూహకర్తగా వ్యవహరించినందుకు ప్రశాంత్ కిషోర్ బృందం కోట్లలో ఫీజు వసూలు చేస్తుంటుంది. సక్సెస్ రేట్ కూడా ఈ బృందానికి ఎక్కువే మరి.

  మమతా బెనర్జీపై తాజాగా నామినేషన్ ప్రక్రియ సందర్భంగా దాడి జరిగింది. దాంతో, అటు తమిళనాడులో డీఎంకే కోసం ప్రశాంత్ కిషోర్ బృందం పనిచేస్తున్న దరిమిలా, అక్కడ కూడా ఇలాంటి ‘వ్యూహం’ అమలవుతుందా.? వేచి చూడాల్సిందే. అన్నట్టు, మమతా బెనర్జీ కాలికి తీవ్ర గాయమే అయ్యిందనీ, రెండు నెలలు విశ్రాంతి అవసరమనీ వైద్యులు సూచించారట. ఇదే నిజమైతే, ప్రశాంత్ వ్యూహం ఈసారి బెడిసి కొట్టినట్లే అవుతుందేమో తృణమూల్ కాంగ్రెష్ పార్టీకి.