తెలంగాణలో మహిళలకు అన్యాయం జరుగుతోంది. వారికి అండగా నేను నిలబడతా: షర్మిల

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న షర్మిల తెలంగాణ రాజకీయాల్లో మహిళల పాత్ర గురించి మాట్లాడారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందని, కానీ, ప్రస్తుత తెలంగాణలో స్త్రీలకు ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అసమానతలు ఉన్నాయని… మహిళలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

వైయస్ రాజశేఖరెడ్డి హయాంలో ఎందరో మహిళలు మంత్రి పదవులను అలంకరించారని… కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే మంత్రులుగా ఉన్నారని చెప్పారు. ఆ ఇద్దరికీ కూడా ఐదేళ్ల తర్వాతే అవకాశం దొరికిందని అన్నారు. మహిళలు అన్నింటిలో సగం అయినప్పుడు… ఈ అన్యాయం ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని చెప్పారు. తాము చేయబోయే ప్రతి పనిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.