మహిళలకు సీ ఎం జగన్ వరాలు

వాస్తవం ప్రతినిధి: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మహిళా నేతలు సీఎం జగన్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా మహిళలకు వరాలు కురిపించారు.

రాష్ట్రంలోని మహిళలందరికీ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్యాజువల్‌ లీవ్స్‌ 15 నుంచి 20కి పెంపు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గడచిన 21 నెలల్లో మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు సీఎం తెలిపారు. అమ్మ ఒడి, వైయ‌స్సార్‌ చేయూత, వైయ‌స్సార్‌ ఆసరా, కాపు నేస్తం, మహిళల పేరుతోనే ఇంటి స్థలాలు, వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చినట్టు ముఖ్యమంత్రి వివరించారు.

నామినేటెడ్‌ పోస్టులతోపాటు నామినేషన్‌ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు ఆయన తెలిపారు. మహిళలపై జరిగే నేరాల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం కోసం దిశ బిల్, ప్రత్యేక న్యాయస్థానాలు తెచ్చినట్టు కూడా సీఎం జగన్‌ వెల్లడించారు. ఉమెన్స్‌ డే సందర్భంగా మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన‌ దిశ వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.