టీడీపీ యువనేత మృతి.. నేతల దిగ్భ్రాంతి

వాస్తవం ప్రతినిధి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత‌ మాగంటి వెంకటేశ్వరరావు కుమారుడు మాగంటి రాంజీ (37) అనారోగ్య కార‌ణాల‌తో నిన్న‌ రాత్రి మృతి చెందారు. టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాంజీ, పార్టీ వ్యవహరాల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. రాంజీ మృతి విషయం తెలిసి టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ నటుడు నారా రోహిత్, మాజీ మంత్రి నారా లోకేశ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ఆయ‌న మృతి ప‌ట్ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంతాపం తెలిపారు.

‘మాగంటి రాంజీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ ఉంటే.. ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకున్నాం. అలాంటిది చాలా చిన్న వయసులో ఇలా అర్థాంతరంగా అందరికీ దూరమైపోవడం బాధాకరం. పార్టీకి తీరని లోటు’ అని చంద్ర‌బాబు చెప్పారు.

‘పుత్రశోకం నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.