ఇలానే వదిలేస్తే వీళ్ల ఆగడాలు పెరిగిపోతాయి: పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఏపీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా వీడియో సందేశం అందించారు. ధనబలం, కండబలం ఉంటేనే రాజకీయాలు చేయగలరన్న పరిస్థితిని మార్చేందుకే 2014లో జనసేన పార్టీని స్థాపించానని, సిద్ధాంతాలే అండగా, కులమత ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలని వచ్చానని వివరించారు.

పంచాయతీ ఎన్నికలలో వైసిపి నాయకులు ఎలాంటి దాష్టీకానికి పాల్పడ్డారో అందరూ చూశారు.అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అంతకుమించిన బీభత్సం ఆ పార్టీ సృష్టిస్తుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రత్యర్థులను నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వడం లేదని పవన్ ఆరోపించారు. ప్రత్యర్ధులు నిలబడితే.. బెదిరింపులు, దాడులు, రక్తపాతమేనని అన్నారు. వైసీపీని ఇలానే వదిలేస్తే వీళ్లు ఆగడాలు పెరిగిపోతాయని పవన్ మండిపడ్డారు. నాలుగు విడతలలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో జనసేన 27 శాతం ఓట్లను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. వందల సంఖ్యలో సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామన్నారు.

మరోవైపు 85% పంచాయతీలలో పోటీ చేస్తే 65 శాతం పంచాయతీ లలో ద్వితీయ స్థానంలో ఉన్నామని పవన్ పేర్కొన్నారు. ఇది చూసి ఓర్వ లేక భయపడి వైసిపి నాయకులు దాడులకు పాల్పడుతున్నారని వారి దాడులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసన్నారు. పెద్ద పెద్ద నాయకులు, హిట్లర్ వంటి వాళ్లే మట్టి కరుచుకు పోయారని అలాంటిది మీరెంత మీ బతుకెంత అంటూ నిప్పులు చెరిగారు. జనసేన అభ్యర్థులను బెదిరించినా ఎదురొడ్డి ఎన్నికల బరిలో నిలబడ్డారని అన్నారు పవన్.