కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొన్న వెంకయ్యనాయుడు

వాస్తవం ప్రతినిధి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా పరిపూర్ణ ఆరోగ్యం, సుఖ శాంతులతో వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.