శ్రీవారి ఆర్జిత సేవలు పై టీటీడీ కీలక నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: రానున్న ఉగాది పర్వదినం నుంచి తిరుమల శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ఉదయం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం జరుగగా, భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు జవహర్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. అయితే, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు 72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని, నెగటివ్ రిపోర్టును చూపించాల్సి వుంటుందని ఆయన అన్నారు.

అలాగే మూడు నెలల ముందు మాత్రమే ఆర్జిత సేవలను బుక్ చేసుకొనే సౌలభ్యాన్ని అందుబాటులో ఉంచింది టీటీడీ. భక్తుల వద్ద నుంచి విపరీతమైన తాకిడి రావడంతో నిత్య సేవలకు లక్కీ డిప్ విధానం, ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా ముందస్తు చర్యలో భాగంగా గత ఏడాది మార్చి 17 నుంచి ఆర్జిత సేవలు నిలిపివేయగా.. మార్చి 20వ తేదీన దర్శనాలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్వామి వారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు, నిత్యోత్సవాలతో పాటుగా కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చింది టీటీడీ. జూన్ 8వ తేదీ నుంచి దర్శనాలు పునఃప్రారంభించినా ఆర్జిత సేవలకు మాత్రం భక్తులను అనుమతించలేదు.