అసలు గుళ్లకు వెళ్లటానికే ఇష్టపడని కామ్రేడ్స్.. స్వామీజీ వద్దకు ఎందుకు వెళ్ళినట్టో..?

    వాస్తవం ప్రతినిధి: ఏపీలో జరుగుతున్న పురపోరులో భాగంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు నారాయణ. ఇందులో భాగంగా విశాఖ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో 97వ వార్డులో సీపీఐ అభ్యర్థిగా యశోద పోటీ చేస్తున్నారు. దీంతో.. ఆమె తరఫున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు నారాయణ. వార్డు ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలోని స్వరూపానందస్వామి మఠం ఉంది. దీంతో.. ఆయన్ను కలిసిన నారాయణ.. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

    అయితే.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. స్వామీజీని నారాయణ కలిసిన వైనం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావటం.. ఆయన తీరును పలువురు తప్పు పట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    అసలు గుళ్లకు వెళ్లటానికే ఇష్టపడని కామ్రేడ్స్.. ఇక స్వామీజీల వద్దకు వెళతారా? వెల్ళి ఆశీర్వాదాలా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక..వామపక్షవాదులైతే నోళ్లు నొక్కుకునే పరిస్థితి. కమ్యునిస్టుల పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ..ప్రచారంలో భాగంగా ఆశ్రమానికి వెళ్లామని.. ఆయన ఆశీస్సులు తీసుకున్న వారంతా గెలుస్తారనే నమ్మకం ఉందని.. అందుకే ఆయన ఆశీస్సులు కోసం స్వామిని అభ్యర్థించినట్లు నారాయణ పేర్కొన్నారు. ఆశ్రమానికి వెళ్లే విషయంలో తనకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేవని ఆయన స్పష్టం చేస్తున్నారు.