ఆనాడు మా నానమ్మ తీసుకొన్న నిర్ణయం ముమ్మాటికీ తప్పే: రాహుల్ గాంధీ

వాస్తవం ప్రతినిధి: 1970వ దశకంలో తన నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అత్యయిక పరిస్థితిని విధిస్తూ తీసుకొన్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసుతో ముచ్చటించిన ఆయన, 1975 నుంచి 1977 మధ్య కాలంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అది తప్పని అంగీకరించారు. ఆ సమయంలో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వెనక్కు తీసుకున్నారని, ప్రసార మాధ్యమాలపై ఎన్నో నియంత్రణలు అమలయ్యాయని, విపక్ష నేతలను జైళ్లకు కూడా పంపారని రాహుల్ గుర్తు చేసుకున్నారు.

“అది తప్పేనని నేను అనుకుంటున్నాను. అవును… అది ముమ్మాటికీ తప్పే. మా నానమ్మ నాడు అలా తలచుకుని ఉండవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ భారత రాజ్యాంగాన్ని ఆక్రమించాలని చూడలేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే, కాంగ్రెస్ కు ఆ శక్తి కూడా లేదు. మా పార్టీ దానికి అంగీకరించదు కూడా” అని రాహుల్ చెప్పారు.