నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం ప్రకటించారు. తిరుపతి కార్పొరేషన్‌‌తో పాటు పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు రాష్ట్ర నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి అవకాశం కల్పించారు. దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులకు రుజువులు ఉండడంతో..వాటన్నింటినీ పరిశీలించిన ఎన్నికల కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతిలో 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు, కడప జిల్లా రాయచోటిలో 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మంగళవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు చేసి ఎస్‌ఈసీ అనుమతించిన వారికే నామినేషన్లకు అవకాశం కల్పించారు.