ఎలక్షన్స్‌ టైమ్‌..రాహుల్ కష్టం మామూలుగా లేదండోయ్..

వాస్తవం ప్రతినిధి: ఎలక్షన్స్‌ టైమ్‌లో లీడర్ల వేషాలు ఇంతింత కాదయా అంటారు కదా.. ఎస్‌.. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగడంతో..గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.
కేరళ, తమిళనాడుల్లో హోరాహోరీ క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఒకవైపు మోదీ, షాల ద్వయాన్ని రఫ్ఫాడిస్తూనే.. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిన్న ఈత కొట్టారు.. చేపలు పట్టారు.. ట్రాక్టర్‌ నడిపారు.. తాటి ముంజెలు తింటూ ఫోజులిచ్చారు. డ్యాన్సులు, ఎక్సర్‌సైజులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా స్టేజీపై సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేశారు. ఏంటి..ఇవన్నీ అనుకుంటున్నారా..? ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గెటప్స్‌. వచ్చే ఎన్నికల్లో పార్టీని అందలమెక్కించేందుకు..పాపం బాగానే కష్టపడుతున్నారు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలొ పోస్ట్ లు పెడుతున్నారు.

మూడు రోజుల పాటు తమిళనాడు పర్యటనలో భాగంగా..రాహుల్ ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాహుల్‌గాంధీ సరదాగా స్టెప్పులేశారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్‌ సెయింట్‌ జోసెఫ్స్‌ మెట్రిక్యులేషన్‌ విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. పుష్‌-అప్స్‌, ‘ఐకిడో’ తో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే నాగర్‌కోయిల్‌ వెళ్లేటప్పుడు ఆచంగులం గ్రామ రహదారి వద్ద ఆగి, తాటి ముంజెలను ఆస్వాదిస్తూ అక్కడి ప్రజలతో ముచ్చటించారు.