పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

వాస్తవం ప్రతినిధి: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద రెండు విమానాలు గాల్లోనే ఓ గంట సేపు చక్కర్లు కొట్టాయి. విమానాశ్రయం పరిధిలో పొగమంచు దట్టంగా పడుతూ ఉండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం స్పైస్ జెట్, ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను రన్ వేపై ల్యాండింగ్ చేయలేక పోయిన పైలట్లు, గాల్లోనే దాదాపు గంటపాటు చక్కర్లు కొట్టారు.

స్పైస్‌ జెట్‌ ఎస్‌జి 3417 విమానం బెంగళూరు నుంచి గన్నవరానికి వచ్చింది. విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే ఎయిర్‌ ఇండియా విమానం ఢిల్లీ నుంచి గన్నవరంకు వచ్చింది. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురి చెందారు. ఉదయం 8:30 గంటల తరువాత పొగమంచు తగ్గుముఖం పట్టడంతో విమానాల ల్యాండింగ్ కు అధికారులు అనుమతినిచ్చారని తెలుస్తోంది.