నేడు మాఘ పౌర్ణమి పర్వదినం..భద్రాద్రిలో ఘనంగా ఉత్సవాలు

వాస్తవం ప్రతినిధి: దక్షిణాది అయోధ్య అయిన భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో మాఘ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. మాఘ పౌర్ణమి సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నారు. 1,001 కలశాలతో సీతారాములకు అభిషేకం చేస్తున్నారు. ఉదయం 10.30గంటలకు మహా కుంభప్రోక్షణ, మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12.30గంటలకు ప్రధాన ఆలయంలో మహానివేదన, సాయంత్రం శ్రీరంగనాయక స్వామి వార్షిక తిరుకల్యాణం నిర్వహించనున్నారు. మాఘ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నందున సీతారాముల వారి నిత్యకల్యాణాలు నిలిపివేశా రు.

ఈ రోజున భక్తులు వారు విష్ణువు, హనుమాన్ లను ఆరాధించాలి. ‘ఇష్టదేవతలతో పాటు, మాఘ పూర్ణిమ దినం పార్వతి దేవిని, బృహస్పతి భగవంతుడిని ఆరాధించాలి. (బృహస్పతి మాఘ నక్షత్రం అదిదేవత కాబట్టి ). అవకాశం ఉన్నవారు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతంను ఆచరించవచ్చు. భారతదేశం అంతటా విష్ణువు ఆలయాలలో చాలా వరకు, ఈ పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు దగ్గర్లోని విష్ణు సంబంధ అంటే సత్యనారాయణ, నరసింహ, వేంకటేశ్వర, విష్ణు తదితర ఆలయాలను సందర్శించాలి. ప్రత్యేక పూజలు అవకాశం లేకుంటే ప్రదక్షణలు చేయాలి. ఈ రోజు ఉపవాసం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. పగటిపూట ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి.