నీర‌వ్ మోదీని భార‌త్‌కు అప్ప‌గించా ల్సిందే .యూకే కోర్టు కీలక తీర్పు

    వాస్తవం ప్రతినిధి: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. నీరవ్ మోదీపై మోపిన మనీ లాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని యూకే కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో నీర‌వ్ మోదీని భార‌త ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌ని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెలువరించింది.

    పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు నుంచి దాదాపు 14 వేేల కోట్ల రూపాయ‌ల రుణం తీసుకొని.. దాన్ని తీర్చ‌లేక యూకే పారిపోయారు నీర‌వ్ మోదీ. అత‌నిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు కేంద్రం సిద్ధం కాగా…తాను మాన‌సిక అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాన‌ని, భార‌త్‌లో త‌న‌ను వేధించే అవ‌కాశముంద‌ని అక్క‌డి కోర్టును నీర‌వ్ మోదీ ఆశ్ర‌యించారు. దీనిపై అనేక‌మార్లు విచార‌ణ జ‌రిగింది.

    ఈ క్ర‌మంలో తాజాగా నీర‌వ్ మోదీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను అక్క‌డి కోర్టు తోసిపుచ్చింది. భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను ఇబ్బంది పెడుతుంద‌ని తాము భావించ‌డం లేద‌ని కోర్టు తెలిపింది. నీర‌వ్‌ మోదీ త‌న‌ మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కూడా కోర్టు న‌మ్మ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అయ‌న్ను భార‌త్‌కు అప్ప‌గించాల‌ని తీర్పునిస్తూ.. త‌మ ఉత్త‌ర్వుల‌పై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని క‌ల్పించింది కోర్టు.