నేడు విష్ణుప్రీతికరమైన మహాపర్వదినం..భీష్మ ఏకాదశి

వాస్తవం ప్రతినిధి: నేడు ఫిబ్రవరి 23 భీష్మ ఏకాదశి.  మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి” అని పిలుస్తారు.

దీనిని జయ ఏకాదశి, అన్నాడ ఏకాదశి, కామికా ఏకాదశి వంటి పేర్లతో పిలుస్తారు. శ్రీ కృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి వివరించాడు. గంగామాత స్త్రీరూపంలో దరించినపుడు అష్టవసువుల్లో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు.

46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ రోజునే స్వచ్ఛంద మరణమనే వరం ద్వారా ప్రాణ త్యాగం చేసినందువల్ల మాఘశుద్ధ అష్టమికి భీష్మాష్టమి అని పేరు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయనీ విశ్వాసం.

ఈ రోజు నిష్టగా ఉపవాసం చేయడం వలన బాధలన్ని తొలగిపోతాయని.. దెయ్యాలు, భూతాలు, పిశాచాల వంటి శక్తుల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతుంటారు. కానీ ఈ ఉపవాసం చేయడానికి ముందు దీనికి గల నియమాలను తెలుసుకోవాలి. ఏకాదశి మూడు రోజులు ఉంటుంది.
ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి.

పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారుకూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తిపొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారు అని నానుడి.

ఈ రోజున విష్ణు సహస్ర నామాన్ని పఠిస్తే…. భీష్మాచార్యుల అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి భీష్మ ఏకాదశి రోజున పితృదేవతలు అర్ఘ్యం సమర్పించడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చు.