పెళ్లి భోజనం తిని ఆసుపత్రిపాలైన 70 మంది

వాస్తవం ప్రతినిధి: పెళ్లి భోజనం తిన్న 70 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలప్రకారం..

నింపూర్ గ్రామానికి చెందిన వధువుకు తెరాడ్ ఘర్ గ్రామంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. దీంతో పెళ్లి కొడుకు తరఫు వారి బంధువులు 70 మంది శనివారం రాత్రి పెళ్లి కూతురు ఇంటికి రిసెప్షన్కు వెళ్లారు. అక్కడ వీరంతా భోజనం చేశారు.

అయితే అక్కడ ఫుడ్ పాయిజన్ కావడంతో వీరు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం బంధువులకు వాంతులయ్యాయి. దీంతో వీళ్లను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.  70 మందికి వాంతులు విరేచనాలు కావడంతో పెళ్లి ఇంట్లో ఆందోళన నెలకొన్నది. ఈ ఘటనపై స్థానిక అధికారులు కూడా ఆరా తీస్తున్నారు.. ఆహారంలో ఏవైనా విషపదార్థాలు కలిసి ఉంటాయా? అన్న విషయంపై వారు దర్యాప్తు చేపడుతున్నారు. బంధువులకు ఫుడ్ పాయిజన్ కావడంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.