వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు శ్రీలంక ప్రభుత్వం షాకిచ్చింది. శ్రీలంక పర్యటనలో భాగంగా పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్ ఇవ్వాల్సిన ప్రసంగాన్ని ఆ దేశం రద్దు చేసింది. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశ్యంతోనే శ్రీలంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ పత్రిక తన కథనంలో ప్రచురించింది.
ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేయడం అలవాటుగా మారిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంకలో కూడా ఇమ్రాన్ ఖాన్ జమ్మూకశ్మీర్ అంశం లేవనెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రసంగం రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
కాగా భారత్ శ్రీలంకకు కోవిడ్ 19 వ్యాక్సిన్లను అందిస్తోంది. ఇప్పటికే 5 లక్షల కోవిషిల్డ్ డోసులను ఆ దేశానికి పంపించింది. ఇలాంటి సమయంలో భారత్‌తో తమకున్న దౌత్య సంబంధాన్ని పణంగా పెట్టేందుకు శ్రీలంక సిద్దంగా లేనట్లు తెలుస్తోంది.
అంతేగాక శ్రీలంకలో ముస్లింలకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. మసీదులలో జంతువులను బలిస్తున్నారని అక్కడి బౌద్దులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఒకవేళ శ్రీలంక పార్లమెంట్లో మాట్లాడితే అప్పుడు భారత్‌తో పాటు స్థానిక బౌద్దులకు కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు భావించి ప్రధాని ప్రసంగాన్ని రద్దు చేసింది.