రాష్ట్రప్రజలకు శుభవార్త చెప్పిన దీదీ

వాస్తవం ప్రతినిధి: అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో అల్లాడిపోతున్న ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. పెట్రోలు, డీజిల్‌పై విధిస్తున్న పన్నును ఒక రూపాయి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి నష్టం కలిగినా ప్రజలపై భారం మోపకుండా ఉండాలనే పెట్రోలు, డీజిల్‌పై పన్నును తగ్గించినట్టు మంత్రి పేర్కొన్నారు. నేటి రాత్రి నుంచే తగ్గింపు ధరలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రా నిన్న ప్రకటించారు.

పెట్రో ధరల తగ్గింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న మరుసటి రోజే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పెట్రోలుపై పన్నుల రూపంలో కేంద్రం రూ. 32.90 తీసుకుంటోందని, అదే సమయంలో రాష్ట్రాలకు లభిస్తున్నది రూ. 18.46 మాత్రమేనని మమత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజిల్‌పై రూ. 31.80ను కేంద్రం వసూలు చేస్తుండగా, రాష్ట్రాలకు మాత్రం రూ. 12.77 మాత్రమే లభిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత వనరులను కేంద్రం దోచుకుంటోందని ఆరోపించింది..