అమెరికాలో మంచు తుఫాన్ క‌ల‌కలం ..62 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో మంచు తుఫాన్ క‌ల‌కలం సృష్టిస్తున్న‌ది. దక్షిణాది రాష్ట్రాలను మంచు ముంచేస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తం కాగా పలు విమానాలను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి. దాదాపుగా 15 కోట్ల మంది అమెరికన్లకి మంచు ముప్పులో ఉన్నట్టుగా ది నేషనల్‌ వెదర్‌ సర్వీసెస్‌ హెచ్చరించింది. మంచుధాటికి అగ్రరాజ్యంలో ఇప్పటివరకూ 62 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితికి అడ్డంపడుతోంది.

టోటల్‌గా అమెరికాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో.. నీరు ఎక్కడికక్కడ గడ్డ కట్టుకుపోయింది. కొన్ని రోజులుగా ఏడ తెరపి లేకుండా కురుస్తున్న మంచు ప్రభావానికి అప్రకటిత లాక్‌డౌన్ ఏర్పడింది. మంచు ధాటికి తట్టుకోలేక 62 మంది మృతి చెందారు. పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతోంది. రోజు వారి పనులకు అవసరమైన నీరు దొరకక, తాగడానికి గుక్కెడు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు. మంచు తుఫాను ప్రభావం టెక్సస్, హ్యుస్టన్‌లలో మరింత తీవ్రతరమైందని అంచనా వేస్తున్నారు అధికారులు. అక్కడ మంచి నీటికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుఫాను కారణంగా మంచి నీటి పైపులలో ఉండే నీరు గడ్డ కట్టుకుని పోవడంతో నీటి సమస్య ఏర్పడింది. నిత్యావసరాలకు కాకపోయినా కనీసం తాగడానికి మంచి నీళ్ళు కావాలంటూ వేలాది మంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.