బెంగాల్ లో అకస్మాత్తుగా 200లకు పైగా శునకాల మృత్యువాత..స్థానికులు ఆందోళన

 వాస్తవం ప్రతినిధి: ఇప్పటి వరకు కరోనాతో మనుషులు, బర్డ్ ఫ్లూ తో కోళ్లు, పక్షులు చనిపోవడం చూశాం. కానీ బెంగాల్ లో శునకాల మృత్యువాత చెందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

బెంగాల్‌లోని బంకురా జిల్లా బిష్ణుపూర్‌ పట్టణంలో మూడు రోజుల వ్యవధిలో 200లకు పైగా వీధి శునకాలు మృత్యువాత పడ్డాయి. మంగళవారం నాడు 60, బుధవారం ఏకంగా 97, గురువారం రోజున 45 శునకాలు మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలిపామని స్థానికులు పేర్కొన్నారు. కాగా మృతిచెందిన శునకాల నుంచి నమూనాలు సేకరించిన వెటర్నరీ సిబ్బంది పరీక్షల నిమిత్తం వాటిని కోల్‌కతా పంపించారు. అయితే పెద్ద ఎత్తున కుక్కల మృతికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణమని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు.

పర్వో వైరస్ (ఫర్వొవిరుస్) కారణంగానే ఆ మూగజీవాలు అకస్మాత్తుగా మరణిస్తుండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. కుక్కల్లో వ్యాప్తి చెందే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదని వారంటున్నారు. కుక్కల్లో ఈ వైరస్ ఒక దాని నుంచి మరొకదానికి తేలిగ్గా వ్యాపిస్తుందని తెలిపారు.