దుర్గ గుడిలో ఏసీబీ దాడులు..దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి ఏపీలోని విజయవాడ దుర్గ గుడిలో వరుసగా మూడోరోజూ ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ లీడర్ జలీల్ ఖాన్ దేవాదాయశాఖ మంత్రి అవినీతికి పాల్పడ్డారని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే మంత్రి వదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంతేకాకుండా, టీడీపీ లీడర్లు కావాలనే విజయవాడలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

కుప్పంలో చంద్రబాబును ఓటర్లు ఛీ కొట్టారని, అందువల్లే కొత్త రకం కుట్రలకు తెరలేపారని చెప్పారు. మత విద్వేషాల పేరుతో రాజకీయం చేస్తున్నారని.. చంద్రబాబు, సోమువీర్రాజు, జీవీఎల్ ఈ ముగ్గురే అందుకు ప్రధాన కారణమని చెప్పారు. అంతర్వేది ఘటనలో రథం దగ్ధం అయితే మూడు నెలల్లోనే కొత్తది చేయించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఆ ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే మీరేం చేశారని ప్రతిపక్షాలపై విరుచుకపడ్డారు. కాగా, దుర్గగుడి అభివృద్ధి కోసం సీఎం జగన్ రూ.70కోట్లు ఇచ్చారని గర్తుచేశారు.