అరుణగ్రహంపై ల్యాండ్ అయిన అమెరికా రోవర్

వాస్తవం ప్రతినిధి: అంగారకుడిపై సూక్ష్మ జీవులను గుర్తించడానికి చేపట్టిన ఆస్ట్రోబయాలజీ పర్సెవెరెన్స్ రోవర్ ప్రయోగం విజయవంతం అయింది. నాసా ప్రయోగించిన ఆస్ట్రోబయాలజీ రోవర్.. పర్సె వెరెన్స్ అంగారక గ్రహంపై ల్యాండ్ అయింది. ఈ ల్యాండింగ్ సక్సెస్ అయినట్లు నాసా ప్రకటించింది .

ఈ రోవర్ అంగారకుడి మధ్యరేఖ సమీపంలోని జెజేరో అనే బిలం వద్ద దిగింది. ల్యాండైన వెంటనే పర్సీవరెన్స్ రోవర్ పని కూడా ప్రారంభించింది. అంగారకుడి ఉపరితలాన్ని రెండు ఫొటోలు తీసి నాసా కేంద్రానికి పంపింది. పర్సీవరెన్స్ రోవర్ ప్రయోగించిన ఉద్దేశం ఏంటంటే… అరుణగ్రహంపై ఉండే రాళ్లు, ఉపరితల భాగం కింద ఉండే మట్టి నమూనాలను సేకరించి, గతంలో ఇక్కడ జీవం ఉండేదా? అన్న విషయాన్ని విశ్లేషిస్తుంది. ఆ సమాచారాన్ని శాస్త్రవేత్తలకు పంపనుంది.

ప్రస్తుతం పర్సీవరెన్స్ రోవర్ ల్యాండైన జెజేరో బిలం ఉన్న ప్రాంతంలో వందల కోట్ల సంవత్సరాల కిందట ఓ సరస్సు ఉండి ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోవర్ విజయవంతంగా దిగడం పట్ల నాసా శాస్త్రవేత్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాలిఫోర్నియాలోని పసడెనా జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ లో ఆనందం మిన్నంటింది. కాగా, ఈ రోవర్ అంగారకుడి ఉపరితలంపై రెండేళ్లపాటు పరిశోధనలు సాగించనుంది. ఇక్కడ జీవజాలం మనుగడకు అవకాశం ఉందా? అనే అంశాన్ని పర్సీవరెన్స్ విశ్లేషించనుంది.