ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న గంటా కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి:విశాఖ వేదికగా ఇప్పుడు రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. చలికాలం పూర్తికాకముందే ఎండల భగభగమండిపోతుండడంతో.. రాజకీయాలు కూడా అదే స్థాయిలో సలసల అంటున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఒక్కొక్కరుగా ఉద్యమం బాట పడుతున్నారు.

టీడీపీ సైతం దీని మీద అధికార పార్టీని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దు అన్నది టీడీపీ ఆలోచన అయితే దాన్ని పక్కన పెట్టేశారు గంటా. ఇక ఇపుడు ఆయన చేస్తున్న విమర్శలు హాట్ కామెంట్స్ టీడీపీకి బాగానే తగులుకుంటున్నాయి..

గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో టీడీపీకి కూడా వాటా ఉందని పెద్ద బాంబు పేల్చారు. ఎందుకంటే 2018లో కేంద్ర ఉక్కుపరిశ్రమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోస్కో ప్రతినిధులతో పాటు మరికొందరు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలోనే ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయం జరిగింది. ఆ తర్వాత అంటే 2019 అక్టోబర్లో జగన్ వచ్చిన తర్వాత ఎంవోయు కుదిరింది. ఈ విషయాన్నే గంటా ఇపుడు ప్రస్తావిస్తున్నారు. తాజాగా గంటా చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది.