వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పడిపోయిన పార్టీ అధికారంలోకి రావాలన్నా, కొత్త పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి తేవాలన్నా నాయకులకు కనిపించే ఒకే ఒక్క మార్గం పాదయాత్ర.
పాదయాత్ర చేస్తే పదవిలోకి రావడం ఖాయమని నిరూపించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.ఎన్నో ప్రతికూల పరిస్దితుల మధ్య చేపట్టిన పాదయాత్రతో ఎన్నికల్లో విజయఢంక మోగించాడు వైఎస్సార్.
ఇక అప్పటి నుండి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలంటే పాదయాత్రనే మేలని తలచిన ఎందరో నేతలు ఇదే బాటలో విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ఇక జగన్ కూడా పాదయాత్రతో పదవిని అలంకరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలంగాణ లో పాదయాత్రలపొటీ కొనసాగుతోంది. పీసీసీ రేస్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి ఇప్పటికే రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేస్తూ జనంలో ఉండగా… వెంటనే సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అదిలాబాద్ నుండి రైతుల కోసం బయల్దేరారు. ఈ ఇద్దరి యాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఇద్దరు నేతలు పాదయాత్ర కు సై అంటున్నారు. ఈ నెల 19నుండి ఎంపీ కోమటిరెడ్డి ప్రాజెక్టుల యాత్ర చేయనున్నారు. బ్రహ్మణవెల్లంల నుండి ఈ పాదయాత్ర మొదలవుతుంది. పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించటం, మధ్యలో రైతులతో ముచ్చటించటం యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ యాత్రను పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డిలు ప్రారంభించనున్నారు.
ఇక తాను కూడా పీసీసీ రేస్ లో ఉన్నట్లు ప్రకటించిన సంగారెద్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈనెల 22 నుండి వారం రోజుల పాటు జగ్గారెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట నుండి మొదలయ్యే ఈ యాత్ర హైదరాబాద్ లోని గన్ పార్క్ వరకు చేయాలని నిర్ణయించారు.