హెచ్‌-4వీసాలపై యూఎస్‌ కోర్టు కీలక ఆదేశాలు

వాస్తవం ప్రతినిధి: హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్‌-4వీసాలపై యూఎస్‌ కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వీసాల ప్రస్తుత స్థితిపై మార్చి 4వ తేదీ లోపు ఉమ్మడి నివేదికను సమర్పించాలని సంబంధిత విభాగాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ డిస్ట్రిక్ట్‌ ఆప్‌ కోలంబియా సర్క్యూట్‌ జడ్జి తాన్యా ఎస్‌ చుత్కన్‌ ఈ మేరకు ఆదేశించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో హెచ్‌-4 వీసాలపై తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు నివేదిక కోరినట్లు తెలుస్తోంది.

2015లో హూమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీస్‌ విభాగం జారీ చేసిన నిబంధనలపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జడ్జి ఆదేశించారు. కాగా, 2017లో బరాక్‌ ఒబామా హయాంలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు యూఎస్‌లో పని చేసుకునేందుకు అనుమతి ఇస్తూ తీసుకువచ్చిన హెచ్‌-4 వీసాదారుల్లో 95 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములు అధికంగా ఉన్నారని సమాచారం.