ప్రజాధనంతో చేపట్టే సంక్షేమ పథకాలకు పార్టీల రంగులేంటి.? : ఎస్‌ఇసి

వాస్తవం ప్రతినిధి: ఆంద్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వేడి కాకరేపుతోంది. తాజాగా ఇంటింటికి రేషన్‌ పంపిణీ వాహనాలపై మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది. దీనికి సంబందించి స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

రేషన్‌ వాహనాలపై ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోతోపాటు, వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఫొటో కూడా ఉంది. వైసిపి పార్టీ రంగులతోపాటు మ్యానిఫెస్టో అంశాలు కూడా ఆ వాహనాలపై ఉన్న నేపథ్యంలో.. వీటిని అనుమతించబోమని స్పష్టంగా చెప్పింది. తటస్థమైన రంగులున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని ఎస్‌ఇసి పేర్కొంది. ప్రజాధనంతో చేపట్టే సంక్షేమ పథకాలకు పార్టీల రంగులేంటి.? వెంటనే తొలగించాలంటూ ఎస్‌ఇసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

5 రోజుల్లో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటూ.. ఇచ్చిన హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఇసి ఒక కీలకమైన ఆదేశాలను ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే రేషన్‌ డోర్‌ డెలివరీ వెహికల్స్‌ లో లోపల, బయట నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పరిశీలించారు. తాజాగా కొన్ని ఆంక్షలను విధించారు. వెహికల్స్‌ పై ఉన్న వైసిపి రంగులను మార్చాలని, లేకపోతే అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. రంగులు మార్చిన వాహనాలను చూపించి ఆ తర్వాత ఇచ్చే అనుమతిని బట్టి నడపాలని ఎస్‌ఇసి ఆదేశించింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో డోర్ డెలివరీ రేషన్ వాహనాల రంగులు మార్చుతారా.? లేదంటే, రంగులు మార్చేందుకు ఇష్టపడరు గనుక.. ఏకంగా, ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన ఆ వాహనాల్ని ఆపేస్తారా.? వేచి చూడాల్సిందే.