అమెరికా అధ్యక్ష ఎన్నికలుకూడా కరోనా సమయంలోనే జరిగాయి కదా?: రామకృష్ణ

వాస్తవం ప్రతినిధి: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగుల సంఘాలు వ్యతిరేక గళం వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు నిలిపివేయకుంటే ఎన్నికల బహిష్కరణకు తాము సిద్దంగా ఉన్నామంటూ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. అవసరమైతే సమ్మెకు కూడా వెళతామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని అంటున్నారు. దీనిపై సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడారు.

కరోనా సాకు చూపి పంచాయతీ ఎన్నికలను ఆపాలనుకోవడం ముఖ్యమంత్రి జగన్ కు తగదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా కరోనా సమయంలోనే జరిగాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎన్నికల విధులను నిర్వహించలేమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. గతంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.