హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్న ఏపీ సర్కార్

వాస్తవం ప్రతినిధి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ వేసిన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. మూడ్రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకుంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పుకొచ్చింది.

అయితే పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో పలువురు మంత్రులు, పార్టీ సీనియర్లు, న్యాయ నిపుణులతో సీఎం జగన్‌ సమావేశమై చర్చిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే మొత్తం నాలుగు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఈ నెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5,9,13,17 తేదీలలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.