జనసేనానికి రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద ఘనస్వాగతం

వాస్తవం ప్రతినిధి: తిరుపతిలో పొలిటికల్ హడావుడి నెలకొంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో కాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద వీరికి ఘనస్వాగతం లభించింది.

మధ్యాహ్నం సమయానికే విమానాశ్రయం వద్దకు జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నాయి. పవన్ రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగింది. అభిమానులకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ పవన్ తన కాన్వాయ్ తో ముందుకు కదిలారు. కాగా, తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీతో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశాన్ని పవన్ కల్యాణ్ ఇవాళ సాంత పార్టీలో చర్చించనున్నారు.
మరోవైపు ధర్మ పరిరక్షణ పేరుతో తిరుపతి నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ర్యాలీ చేపట్టారు. ..తిరుపతి వేదికగా అటు పవన్.. ఇటు అచ్చెన్నాయుడు ఇద్దరూ ఒకేసారి కార్యక్రమాలు చేపడుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.