ఆసీస్ పై సిరీస్ విజయం ..టీమ్ ఇండియాకు ప్రముఖుల అభినందనలు

వాస్తవం ప్రతినిధి: బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తన జూలు విదిల్చింది. సిరీస్ కి కీలకమైన గబ్బా టెస్ట్ మ్యాచ్లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి భారత్ జాతీయ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది.

ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై అది కూడా టెస్టుల్లో ఓడించడం ఏమంత సులువు కాదు. ఆటలో నైపుణ్యం కంటే ఆటగాళ్ల నిబ్బరానికి పరీక్ష పెట్టే పరిస్థితులు ఆసీస్ లో ఎదురవుతాయి. అయితే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ భారత కుర్రాళ్ల జట్టు ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్ ను 2-1తో సగర్వంగా గెలుచుకుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ విజయం దక్కిందో గుర్తించిన బీసీసీఐ భారత జట్టుకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.

ఆసీస్ గడ్డపై భారత జట్టు అద్వితీయమైన రీతిలో టెస్టు సిరీస్ ను చేజిక్కించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో భారత జట్టు జైత్రయాత్రను అందరం బాగా ఆస్వాదించామని ట్వీట్ చేశారు. ఈ పర్యటన ఆసాంతం భారత ఆటగాళ్ల తపన, తరగని, విజయం సాధించాలన్న పట్టుదల కొట్టొచ్చినట్టు కనిపించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీమిండియాకు శుభాభినందనలు తెలిపారు. భవిష్యత్ లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

టీమిండియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా కెప్టెన్ రహానేతో పాటు జట్టు సభ్యులను కేసీఆర్ అభినందించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. హార్టీ కంగ్రాట్స్ టీమిండియా.. ఇది నిజంగా గొప్ప విజయం. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా వేదికగా టీమిండియా విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. మ్యాచ్లో మీరు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల ఈరోజు దేశం మొత్తం గర్విస్తుంది అని ట్విట్ చేశారు.

టీం ఇండియా విజయం పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. మరోసారి చరిత్ర నమోదైంది అంటూ గబ్బాను జయించారని అలాగే 2-1తో సిరీస్ ను ముగించిన టీమిండియా చిరాకాలం గుర్తిండిపోయేలా విజయాన్ని అందించిందని నిజంగా ఇది చాలా గర్వకారణమని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ టీమిండియా జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఇంత గొప్ప విజయం అందుకున్న టీమిండియాకు కంగ్రాట్స్. ఈ విజయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు అంటూ చరిత్ర సృష్టించారని అన్నారు.

ఇక వెంకటేష్ అయితే ఏకంగా టీవీలో భారత జట్టు విజయాన్ని సెల్ఫీ తీసుకుంటూ టీమిండియా అమేజింగ్ అంటూ ట్వీట్ చేశారు. నేడు జరిగిన ఇండియా వ్స్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో ఇండియా జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఇక టీమ్ సభ్యులందరికి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు.