తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ..ముక్కనుమ పండుగ విశిష్టత

ఆప్తులకు ముక్కల పండుగ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు..

ఒకప్పుడు సంక్రాంతి కేవలం మూడు రోజుల పండుగగానే ఉండేది. సంక్రాంతి ముందు రోజు భోగిని కీడుపండుగగా భావిస్తారు. ఈరోజు భోగిమంటలు వేయడం, భోగిపళ్లు పోయడం, బొమ్మల కొలువు పెట్టడం వంటి పనులు చేస్తారు. వీటితో జీవితంలో ఉన్న చెడు అంతా వెళ్లిపోయి… భోగభాగ్యాలు వస్తాయని నమ్ముతారు. అందుకే దీనికి భోగి అన్న పేరు వచ్చింది.

సంక్రాంతి రెండో రోజుని, మార్పుకి సూచనగా భావిస్తారు. చేతికి అందిన పంటలతో పిండివంటలు చేసుకొని దేవతలకు కృతజ్ఞత చెబుతారు. పనిలోపనిగా పితృదేవతలని కూడా తల్చుకుంటారు. అందుకే ఈ రోజుకి పెద్దల పండుగ అన్న పేరు కూడా ఉంది.

ఇక సంక్రాంతి మూడో రోజు కనుమ పశువుల పండుగ. ఈ రోజు పశువులని అలంకరించి, వాటికి మంచి ఆహారాన్ని అందిస్తారు. గారెలు, మాంసం వండి వాటిని పితృదేవతలకు నివేదన చేస్తారు.
ఇలా కనుమతోనే సంక్రాంతి సంప్రదాయాలన్నీ పూర్తయిపోతాయి. అందుకనే శాస్త్ర ప్రకారం అసలు ముక్కనుమ అన్న పండుగే లేదు. కాకపోతే కనుమ మర్నాడు గ్రామదేవతలకు బలులిచ్చి, మాంసాహారాన్ని వండుకునే ఆచారం మాత్రం ఉంది. అదే క్రమంగా ముక్కనుమగా మారింది. అందుకే ఈ రోజుని ముక్కల కనుమ అని కూడా పిలుస్తారు.

మనలో చాలామందికి కోళ్లపందాలు గురించి తెలుసు. కాని నా చిన్నప్పుడు పొట్టేలు పందాలు చూసాను. పొట్టేల్లకు కత్తి మెడదగ్గర కడతారు. మన ఆచారవ్యవహారలపై నిషేదాలు ఉండడం కడుశోచనీయం. మనుషుల ప్రాణాలకే ముప్పు ఉన్న జల్లికట్టు పక్కరాష్ఠంలో ఎటువంటి నిషేదాజ్ణలు లేవు. కాని ఇక్కడ మాత్రం నిషేదం అమలవ్వుతుంది. ఊరిలో వేటేస్తారు. వంతులు పంచుతారు. ఇక్కడ తలకాయమాసం, బోటిదే పెద్దపీట.

మినుమగారెలు, ఉల్లిగారెలు, చిల్లిగారెలు వేడి వేడి మాసంకూరతో నంచుకొంటే ఆ మజానేవేరు. ముందు అరటి ఆకుమీద పడేవి ఇవి. ఇంక ఆతరువాత ఆంద్రాలో కొబ్బరి అన్నం లేదా పులావ్ రుచులు వేరయా..అలాగే తెలంగాణాలో బగరా అన్నం. చిక్కటి ఇగురుతో వీటిని తింటుంటే లొట్టలు వెయ్యాల్సిందే.
పూర్తిస్తాయి భోజనం తరువాత అలా నడుంవాల్చి ఒక మిటా పాన్, కలకత్తా మీనాక్షి,కారా పాన్ తింటే గాని మనం తిన్నది పూర్తి న్యాయం చెయ్యలేము.

సాయింత్రం అవుతుంటే ఏదో వెలితి…నెమ్మది నెమ్మదికా అన్నలు, బావలు, అత్తలు బట్టలు అవి సర్ధుకొంటారు.
ఒరే తమ్ముడూ, చక్కగా చేసారురా అని అక్క అంటుంటే…
మావయ్య మాకు ఇక్కడే ఉండాలి అని ఉంది, కాని స్కూల్ కి వెళ్ళాలి కదా అని అక్క పిల్లలు అంటుంటే…
ఒరే అబ్బాయి, ఈసారి అందరం మూడురోజులు ముందే వస్తాము అని పెద్దమ్మ అంటుంటే…
నాలుగు రోజులు నాలుగు నిమషాలగా అయిపోయిందే అని ఒక పక్క బాద…
మరో పక్క, దైనందిక జీవితంలో మన ప్రయాణం సాగించాలి కదా…
అని అనుకొంటూ… నా సంక్రాంతి సంచికలు ఇక్కడితో ముగిస్తున్నాను.

ముక్కనుమ ముచ్చటైన మీ కుటుంబాన్ని ఆయురారోగ్యఐశ్వర్యాలతో విలసింప చెయ్యాలి.

ఇట్లు
కరోతు సురేష్