రామ మందిర నిర్మాణానికి తన వంతు విరాళాన్ని అందించిన రఘురామకృష్ణరాజు

వాస్తవం ప్రతినిధి: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కసరత్తు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 15 మంది సభ్యులతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. ఇందులో 9 మంది శాశ్వత, 6 నామినేటెడ్ సభ్యులను ఉంచింది. ఈ ట్రస్టు రామ మందిర నిర్మాణాన్ని, నిర్వహణను చూసుకుంటుంది. రామ మందిర నిర్మాణం కోసం ఈ ట్రస్టు విరాళాలు సేకరిస్తుంది.

స్వామి వారి ఆలయ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావాలనే భక్తిభావనతో ఎంతో మంది విరివిగా తమ విరాళాలను ఇస్తున్నారు.ఈ నేపధ్యంలో అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రూ. 5,00,100 విరాళాన్ని ఇచ్చారు. గుజరాత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఏకంగా రూ. 11 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఇదే మాదిరి ఎందరో భారీ విరాళాలను ఇస్తున్నారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా తన వంతుగా విరాళాన్ని అందించారు. అయోధ్య రామ మందిరం భూమి పూజ రోజున తన మూడు నెలల జీతం రూ. 3.9 లక్షలను విరాళంగా ఇచ్చానని రఘురాజు తెలిపారు. ఈరోజు భక్తులతో కలిసి రూ. 1,11,111 ఇచ్చానని చెప్పారు.