బిడెన్ ప్రభుత్వంలో మరో ఇండియన్-అమెరికన్ నియామకం

వాస్తవం ప్రతినిధి: ఈ నెల 20వ తేదీన అమెరికా 45వ అధ్యక్షుడిగా జో బిడెన్ బాధ్యతలు స్వీకరించబోతోన్నారు.

బిడెన్ సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో భారతీయులు కీలక పాత్ర పోషించబోతోన్నారు. బిడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు ఇండియన్-అమెరికన్లు పలు హోదాల్లో నియమితులు అయ్యారు. తాజాగా.. అదే జాబితాలో మరో ఇండియన్-అమెరికన్ చేరారు. భారత సంతతికి చెందిన మహిళ గరిమా వర్మ.. జో బిడెన్ టీమ్లో ఉన్నారు. జో బిడెన్ డిజిటల్ డైరెక్టర్గా ఆమె నియమితులు అయ్యారు. ఈ మేరకు జో బిడెన్ కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది. గరిమా వర్మతోపాటు రోరీ బ్రోసియస్ అనే అమెరికన్ ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.

గరిమా వర్మ భారత్ లో జన్మించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కుటుంబం కాలిఫోర్నియాలోని సెంట్రల్ వ్యాలీలో నివసిస్తోంది. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆమె బిడెన్-హ్యారిస్ క్యాంప్ లో పనిచేశారు. మీడియా వ్యూహకర్తగా వ్యవహరించారు.

రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు గరిమా.. పారామౌంట్ పిక్చర్స్లో పనిచేశారు. అందులో గ్రాఫిక్స్ డివిజన్ హెడ్ గా ఉన్నారు. అనంతరం ప్రఖ్యాత వాల్ట్ డిస్నీకి చెందిన ఏబీసీ నెట్వర్క్లో టెలివిజన్ షో హోస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత ‘హారిజాన్ మీడియా’ అనే ఏజెన్సీని నడిపించారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.