పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీల్లో మార్పులు

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై అన్ని కార్యక్రమాలపై పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వ్యాక్సినేషన్ ఈనెల 16న ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో
ప్రతీ ఏటా జనవరిలో జరగాల్సిన పల్స్ పోలియా కార్యక్రమం కూడా వాయిదా పడింది. ప్రతీ ఏడాది జనవరి 17న దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కేంద్రం చేపడుతూ వస్తోంది. అయితే ఈ సారి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఏటా జనవరి 17వ తేదీన జరగాల్సిన పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీల్లో కేంద్రం మార్పులు చేసింది.

కరోనా తొలి దశ వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత జనవరి 31న పోలియో టీకాల కార్యక్రమం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నారు.

జనవరి 16 నుంచే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా మొదలు కానుంది. మొదటి దశ వ్యాక్సినేషన్‌ను ఆ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కావడం..దానికి పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమైన నేపథ్యంలో… పోలియో ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్‌ను వాయిదా వేసింది.